Black Mail Case: నటి సోదరిపై అత్యాచారం.. ప్రైవేట్ ఫొటోలతో బెదిరింపులు.. యువకుడు అరెస్ట్!

Black Mail Case: నటి సోదరిపై అత్యాచారం.. ప్రైవేట్ ఫొటోలతో బెదిరింపులు.. యువకుడు అరెస్ట్!

కన్నడ నటి సోదరిపై అత్యాచారం కేసులో రాఘవేంద్ర(28) అనే వ్యక్తిని బెంగళూరులోని చంద్రాలేఅవుట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నటి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాఘవేంద్ర అనే వ్యక్తిపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్, బెదిరింపుల కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మరోవైపు రాఘవేంద్ర కూడా ఆమెపై తిరిగి కంప్లైంట్ చేయడంతో కొత్త ట్విస్ట్ మొదలైంది. దీంతో పోలీసులు రెండు కేసులను విడివిడిగా దర్యాప్తు చేస్తూ నిజనిజాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

నటి సోదరి ఆరోపణలు..

ఫిర్యాదు ప్రకారం, ఉద్యోగం చేస్తున్న సమయంలో రాఘవేంద్రతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన ఇష్టానికి విరుద్ధంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది. ఈ ఫిర్యాదు ఆధారంగా చంద్రలేఅవుట్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి రాఘవేంద్రను అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా విభేదాలు తలెత్తాయని ఆమె తెలిపింది. రాఘవేంద్ర తన క్రెడిట్ కార్డు ద్వారా రుణం తీసుకోవడంతో గొడవలు జరిగాయని, అప్పటికే అతనికి వివాహమైందనే విషయాన్ని దాచిపెట్టి పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపించింది. అలాగే వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించి డబ్బు వసూలు చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.

ఇప్పటికే ఇదే విషయంపై పోలీసులను ఆశ్రయించగా, రాఘవేంద్రతో వ్యక్తిగత ఫొటోలు డిలీట్ చేయించి హెచ్చరించినట్లు ఆమె తెలిపింది. అయినప్పటికీ, కొద్ది రోజుల తర్వాత గాయపడిన చేతి ఫొటోలతో పాటు వ్యక్తిగత చిత్రాలు పంపి, తాను చెప్పిన చోటుకు రావాలని మళ్లీ బెదిరించాడని ఆరోపించింది.

రాఘవేంద్ర వాదన..

రాఘవేంద్ర మాత్రం ఆరోపణలను పూర్తిగా ఖండించాడు. తమిద్దరూ దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నామని, ఇటీవల ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడంతో తాను దూరంగా ఉన్నానని తెలిపాడు. అందుకే తనపై తప్పుడు అత్యాచార కేసు పెట్టిందని ఆరోపించాడు. అంతేకాదు, నటి సోదరి తనను, తన తల్లిని ఫోన్‌లో బెదిరించిందంటూ తలఘట్టపుర పోలీస్ స్టేషన్‌లో ప్రతిఫిర్యాదు చేశాడు.

ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు NCR (Non-Cognizable Report) నమోదు చేసి ఆమెకు విచారణ నోటీసు జారీ చేశారు. అయితే ఆమె ఇప్పటివరకు హాజరుకాలేదని సమాచారం. ఇకపోతే, ప్రస్తుతం చంద్రలేఅవుట్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి రాఘవేంద్రను అరెస్ట్ చేయగా, ఇరు పక్షాల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఆ సదరు నటి ఎవరనేది సస్పెన్స్గా మారింది.