మాకోసం ప్రాణాలు తీసుకోకండి.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో యష్

మాకోసం ప్రాణాలు తీసుకోకండి.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో యష్

కన్నడ హీరో యశ్(Yash) పుట్టినరోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. యష్‌ బర్త్ డే బ్యానర్స్ ఏర్పాటు చేస్తూ.. కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మృతి చెందారు. మృతి చెందిన వారు హనుమంత మజ్జురప్ప హరిజన్, మురళి నీలప్ప నిడివిమని, నవీన నీలప్ప గజిగా గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తాజాగా హీరో యష్ మృతుల కుటుంబాలను పరామర్శించి.. వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆ సందర్బంగా యశ్ మాట్లాడుతూ.. నాకు పుట్టినరోజు అంటేనే భయం వేస్తుంది. నిజం చెప్పాలంటే అసహ్యమేస్తోంది. మీరు నాకు ప్రేమను ఇస్తే చాలు అదే నాకు నిజమైన పుట్టినరోజు. ఈ బ్యానర్లు కట్టి హంగామా చేయడం నాకు ఇష్టముండదు. అలా చేసేవారికి ఏదైనా జరిగితే ఆ కుటుంబాలకు ఎవరు దిక్కు? 

ఇప్పుడు నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను.. దయచేసి నా పుట్టినరోజు అప్పుడు బైక్‌ ర్యాలీలు, బ్యానర్ లు కట్టడాలు వంటివి చేయకండి. నాపై ప్రేమను చూపించండి, మంచి పనులు చేయండి, మీరు సంతోషంగా ఉండండి అది చాలు. ఈ కుటుంబాలకు ఏం చేయాలో అది చేస్తాను. ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కారణం.. చనిపోయిన వారి తల్లిదండ్రులను గౌరవించడానికి. ఆ కుటుంబాలు తమ బిడ్డలను కోల్పోయారు. మాపై అభిమానంతో మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. కాస్త గౌరవంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు యష్. ప్రస్తుతం యష్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.