
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 27న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన టీమ్.. తాజాగా కొచ్చిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. భాషా హద్దుల్లేకుండా సినిమాల్ని తీస్తున్నారు.
‘కన్నప్ప’ చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. అన్ని భాషల నటీనటులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి ఈ మూవీని చేశారు. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణుకి థాంక్స్. శివుడుకి కన్నప్ప గొప్ప భక్తుడు. అలాంటి గొప్ప భక్తుడి కథను ఎంతో గొప్పగా నిర్మించారు. ఆ శివుడి అనుగ్రహం ఈ ‘కన్నప్ప’ చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
మోహన్ బాబు మాట్లాడుతూ ‘మోహన్‌లాల్ నాకు సోదరుడి వంటి వారు. ఈ మూవీ కోసం ఇంత వరకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని చెప్పారు. విష్ణు మంచు మాట్లాడుతూ ‘ఈ మూవీ ఆ శివుడి ఆశీస్సులతోనే జరిగింది. మోహన్‌లాల్ గారు నాకు తండ్రి సమానులు. ట్రైలర్ చూస్తే ఆయన పాత్ర ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా పూర్వ జన్మ సుకృతం’ అని చెప్పాడు. శివతత్త్వాన్ని చాటేలా ఈ మూవీని తీశామని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ చెప్పాడు. నటులు ముఖేష్ రిషి, శివ బాలాజీ, అర్పిత్ రంకా, నిర్మాత ఆంటోని పెరంబవూర్ పాల్గొన్నారు.