కరీంనగర్, జగిత్యాలలో మెడికల్ కాలేజీల బిల్డింగ్ నిర్మాణ పనులు వెరీ స్లో

కరీంనగర్, జగిత్యాలలో మెడికల్ కాలేజీల బిల్డింగ్  నిర్మాణ పనులు వెరీ స్లో
  • కరీంనగర్, జగిత్యాలలో ఏళ్లుగా సాగుతున్న నిర్మాణాలు 
  • సీడ్ గోదాంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ నిర్వహణ 
  • విద్యార్థులకు తప్పని తిప్పలు 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల మెడికల్ కాలేజీల బిల్డింగ్స్ నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి.  జగిత్యాలలో కాలేజీ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోగా.. కరీంనగర్ లో పనులు చాలా నెమ్మదిగా నడస్తున్నాయి. క్లాసులు తాత్కాలికంగా గోదాములు, షెడ్లలో నిర్వహిస్తున్నప్పటికీ.. హాస్టళ్ల విషయంలో మెడికోలకు ఇబ్బందులు తప్పడం లేదు. కాలేజీకి దూరంగా అద్దె భవనాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. 

సీడ్ గోదాముల్లో కరీంనగర్ మెడికల్ కాలేజీ..

కరీంనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని నగర శివారు కొత్తపల్లిలోని సీడ్ గోదాముల్లో 2023 సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ప్రారంభించారు. అప్పట్లో దీనిని రూ.7 కోట్లతో కాలేజీగా తీర్చిదిద్దారు. రెండేళ్లలో మొదటి, రెండో బ్యాచ్ ల్లో 100 మంది చొప్పున అడ్మిషన్ పొందారు. ఆ కాలేజీకి పక్కన 25 ఎకరాల్లో బిల్డింగ్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.138 కోట్లను కేటాయించింది. ఏడాదిలోనే ఈ కాలేజీ భవన నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ.. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాగే నిర్లక్ష్యంగా పనులు చేస్తే మరో ఏడాదైనా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

కాలేజీకి దూరంగా హాస్టళ్లు

కరీంనగర్ మెడికల్ కాలేజీలకు ఇంకా హాస్టల్స్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో అద్దె భవనాల్లో హాస్టళ్లు నిర్వస్తున్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లోని తీగలగుట్టపల్లిలోని ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో రెండు బ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు చెందిన 84 మంది గర్ల్స్ కు ఒకే చోట వసతి కల్పించారు. బాయ్స్ లో ఒక బ్యాచ్ కు విద్యానగర్‌‌‌‌‌‌‌‌లో, మరో బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు శ్రీపురం కాలనీలో హాస్టళ్లు ఏర్పాటు చేశారు. ఇంత మందికి కలిపి ఒక మినీ బస్సు మాత్రమే ఏర్పాటు చేశారు.  మూడు, నాలుగు ట్రిప్పులు వేస్తేగానీ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 

సెకండియర్ స్టూడెంట్స్ కరీంనగర్ జనరల్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్ లో ప్రతి రోజు రెండు గంటలు ఓపీ చూడాల్సి ఉంది. వీరికి ఉదయం 9 గంటలకే ఓపీ ప్రారంభమవుతుంది. ఫస్టియర్ విద్యార్థులను దింపి.. సెకండియర్ వాళ్ల దగ్గరికొచ్చేసరికి టైం సరిపోవడం లేదు. జగిత్యాల మెడికల్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌‌‌‌‌‌‌‌ను నర్సింగ్‌‌‌‌‌‌‌‌కాలేజీ ఆవరణలోని బిల్డింగ్‌‌‌‌‌‌‌‌లో, బాయ్స్ హాస్టల్‌‌‌‌‌‌‌‌ను జగిత్యాలలోని ఓ అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. 

బోధనా సిబ్బంది పోస్టుల్లో సగం ఖాళీగానే..

కరీంనగర్ మెడికల్ కాలేజీ టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 27 ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ పోస్టులకుగాను 10 మంది మాత్రమే ఉన్నారు. 30 అసోసియేట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ పోస్టులుంటే  17 మంది మాత్రమే పని చేస్తున్నారు. 58 అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ పోస్టులకు 51 మంది పనిచేస్తున్నారు. 45 సీనియర్‌‌‌‌‌‌‌‌ రెసిడెన్స్‌‌‌‌‌‌‌‌ పోస్టులకు గానూ 30 మంది, 25 ట్యూటర్‌‌‌‌‌‌‌‌ పోస్టులకు 15 మంది మాత్రమే పని చేస్తున్నారు. 

బిల్లుల పెండింగ్‌‌‌‌‌‌‌‌తో ఆగిన ‘జగిత్యాల’ కాలేజీ 

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్‌‌‌‌‌‌‌‌ క్యాంపులో 8.6 ఎకరాల్లో మెడికల్ కాలేజీ, హాస్టల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.132 కోట్లు మంజూరు చేయగా 2022 డిసెంబర్ లో ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు మూడు సంవత్సరాల్లో బ్యాచ్ కు 150 మంది చొప్పున మూడు బ్యాచ్ ల అడ్మిషన్లు జరిగాయి. తొలుత తాత్కాలికంగా క్లాసులు నిర్వహించేందుకు రూ.14 కోట్లతో టెంపరరీ బిల్డింగ్స్ నిర్మించారు. మిగతా రూ.115 కోట్లతో మెడికల్‌‌‌‌‌‌‌‌కాలేజీ బిల్డింగ్స్, మెడికోలకు హాస్టల్స్ నిర్మాణం చేపట్టారు. 

మూడేళ్లలో కాలేజీ భవన నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. అయితే బిల్లులు పెండింగ్ లో ఉండడంతో కాంట్రాక్టర్  ఆర్నెళ్ల క్రితమే పనులు నిలిపివేశారు. ఇంకా అడ్మినిస్ట్రేటివ్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌, ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌, ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌, ఆయా వివిధ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల హెడ్స్‌‌‌‌‌‌‌‌కు క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది.