కరీంనగర్ జిల్లాలో సర్వీస్రోడ్డు, అండర్ పాస్ నిర్మించాలని ఆందోళన

కరీంనగర్ జిల్లాలో సర్వీస్రోడ్డు, అండర్ పాస్ నిర్మించాలని ఆందోళన

 కరీంనగర్ జిల్లా ఈదుల గట్టేపల్లి, కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామస్తుల ధర్నా 
 మాజీ ఎంపీ వినోద్​ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మద్దతు

శంకరపట్నం/ మానకొండూర్, వెలుగు : కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదుల గట్టేపల్లి గ్రామానికి సర్వీస్ రోడ్డు నిర్మించాలని, శంకరపట్నం మండలం కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాల మధ్య అండర్​పాస్​నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆయా చోట్ల గ్రామస్తులు మంగళవారం ఎన్ హెచ్-563పై ధర్నాకు దిగారు. దీంతో కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సర్వీస్ రోడ్డు లేకపోవడంతో గ్రామానికి వెళ్లాలన్నా, గ్రామం నుంచి హైవే ఎక్కాలన్నా సుమారు 10 కిలోమీటర్లు చుట్టూ తిరగాల్సి వస్తోందని ఈదుల గట్టెపల్లి గ్రామస్తులు ఆరోపించారు.

 గతంలో కలెక్టర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. కాగా, హైవేపై వెళ్తున్న మాజీ ఎంపీ వినోద్​కుమార్​, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు ఆగి గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు. ఇక్కడ అండర్ పాస్ నిర్మాణం సాధ్యం కాకపోవచ్చని, సర్వీస్ రోడ్డు కోసం హైవే అధారిటీ అధికారులతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. 

కొత్తగట్టు వద్ద గ్రామస్తులు చేపట్టిన నిరసనకు వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మద్దతు ఇచ్చారు. డిసెంబర్​లో ప్రధాని మోదీ ఈ హైవేను ప్రారంభించనున్నారని, ఇక్కడ అండర్ పాస్ నిర్మించకపోతే ప్రారంభించే రోజే కరీంనగర్ నుంచి వరంగల్ వరకు ఎక్కడికక్కడ రోడ్లు దిగ్బంధం చేస్తామని వినోద్ కుమార్​చెప్పారు.