'Sardar 2' Trailer Release: డ్యూయల్ రోల్‌లో కార్తి విశ్వరూపం.. 'సర్దార్ 2' ట్రైలర్ ఎలా ఉందంటే?

'Sardar 2' Trailer Release: డ్యూయల్ రోల్‌లో కార్తి విశ్వరూపం.. 'సర్దార్ 2' ట్రైలర్ ఎలా ఉందంటే?

బాక్సాఫీస్ వద్ద మరోసారి 'సర్దార్' దూకుడు మొదలైంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, విజనరీ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ కాంబోలో వచ్చి సంచలనం సృష్టించిన స్పై థ్రిల్లర్‌కు సీక్వెల్‌గా 'సర్దార్ 2' థియేటర్ల వేటకూ సిద్ధమైంది. లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.  భారీ విజువల్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఫైట్స్, హై-వోల్టేజ్ బ్లాక్ ఆప్స్ మిషన్‌లతో ట్రైలర్ మైండ్ బ్లాక్ చేస్తోంది. కార్తి మరోసారి ద్విపాత్రాభినయంలో అలరించనున్నారు.

ఈసారి కథలో సీక్వెల్‌తో పాటు ఆసక్తికరమైన ప్రీక్వెల్ డ్రామా ఉంది. గతంలో సీక్రెట్ ఏజెంట్ చంద్రబోస్ (సర్దార్) పూర్తి చేశాననుకున్న ఒక మిషన్.. నేటికీ అతడిని నీడలా వెంటాడుతుంది. ఆ పాత శత్రువే కొత్త రూపంలో ముప్పుగా మారతాడు. ఆ వినాశకరమైన ముప్పుకు పేరే 'బ్లాక్ డాగర్'. తండ్రి బాటలోనే నడుస్తున్న కొడుకు విజయ్ ప్రకాష్ కూడా ఈ ప్రమాదకర ఆపరేషన్‌లోకి దిగడంతో కథలో ఉత్కంఠ పీక్స్‌కు చేరింది. 

ట్రైలర్‌లో మెయిన్ హైలైట్ కార్తి, ఎస్‌జే సూర్యల మైండ్ గేమ్. విలన్‌గా ఎస్‌జే సూర్య క్రూరమైన స్టైలిష్ అవతారంలో భయపెడుతున్నారు. 'సర్దార్.. నేను నీ ఫ్యాన్‌ని, ఫ్యాన్‌బాయ్ మూమెంట్ ఏంటో నీకు చూపిస్తా' అంటూ ఆయన ఇచ్చే వార్నింగ్ కేక పుట్టిస్తోంది. మరోవైపు 'ఒక్క ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు బాస్' అంటూ కార్తి చెప్పే ఇంటెన్స్ డైలాగ్స్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి.

ఈ మూవీలో కార్తి సరసన మాళవిక మోహనన్ నటించింది. ఇందులో మాళవిక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో సందడి చేయగా.. ఆషికా రంగనాథ్, రజిషా విజయన్, యోగి బాబు కీలక పాత్రల్లో అలరించనున్నారు. సామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్లింది. సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి..