బ్యాగ్రౌండ్ లేదు.. గాడ్ ఫాదర్ లేడు.. బుల్లి తెర నుంచి సినిమా స్టార్గా కవిన్ ప్రస్థానం అదుర్స్

 బ్యాగ్రౌండ్ లేదు.. గాడ్ ఫాదర్ లేడు..  బుల్లి తెర నుంచి సినిమా స్టార్గా కవిన్ ప్రస్థానం అదుర్స్

ఒకప్పుడు సీరియళ్లలో కనిపించిన కుర్రాడు.. ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. స్టార్‌ హీరోల కుటుంబ నేపథ్యం లేదు. తొలి సినిమాతోనే భారీ విజయం దక్కలేదు. అయినా అవకాశాల కోసం ఎదురుచూడకుండా.. వచ్చిన ప్రతి అవకాశాన్ని తనను తాను నిరూపించుకునే మెట్టుగా మార్చుకున్నాడు. టెలివిజన్‌ నుంచి సినిమాల్లోకి, సహాయ పాత్రల నుంచి కథానాయకుడి స్థాయికి, అక్కడినుంచి విభిన్నమైన పాత్రల వైపు సాగుతున్న ఈ ప్రయాణమే నటుడు కవిన్‌ ప్రత్యేకత. ‘దాదా’, ‘స్టార్‌’, ‘బ్లడీ బెగ్గర్‌’, ‘కిస్‌’, ‘మాస్క్‌’ వంటి సినిమాలతో తనలోని నటుడిని ఒక్కో కోణంలో చూపించిన కవిన్‌.. ఇప్పుడు నయనతారతో కలిసి ‘హాయ్‌’లో కనిపించబోతున్నారు. 

కవిన్‌ నటనా ప్రయాణం వెండితెరతో మొదలవ్వలేదు. తమిళ టెలివిజన్‌ సీరియళ్లతో ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. ‘సరవణన్‌ మీనాక్షి’ వంటి సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెరపై కనిపించే సాధారణ నటుడి స్థాయి నుంచి తనకంటూ అభిమాన వర్గాన్ని సంపాదించుకోవడం ఆయనకు మొదటి పెద్ద విజయం. ఆ గుర్తింపే తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం తలుపులు తెరిచింది. 

చిన్న పాత్రల నుంచి హీరోగా..

సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో కవిన్‌కు ప్రధాన పాత్రలు దక్కలేదు. ‘పిజ్జా’, ‘ఇంద్రు నేత్రు నాళై’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. 2017లో ‘సత్రియన్‌’లో సహాయ పాత్ర పోషించారు. అయితే ఈ దశలో వచ్చిన ప్రతి అవకాశం ఆయనకు అనుభవాన్ని పెంచింది. 2019లో ‘నట్పునా ఎన్నాను తెరియుమా’తో కథానాయకుడిగా అడుగుపెట్టారు. ఆ చిత్రం ఆయనకు వెంటనే స్టార్‌డమ్‌ తీసుకురాకపోయినా.. హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం మాత్రం ఇచ్చింది. 

బిగ్‌బాస్‌తో మరింత దగ్గరైన ప్రేక్షకుడు

2019లో ‘బిగ్‌బాస్‌ తమిళ్‌ 3’లో పాల్గొనడం కవిన్‌ కెరీర్‌కు మరో కీలక మలుపు. అప్పటివరకు ప్రధానంగా సీరియల్‌, సినిమా ప్రేక్షకులకు తెలిసిన ఆయన.. ఈ కార్యక్రమం ద్వారా విస్తృతమైన ప్రేక్షక వర్గానికి చేరువయ్యారు. తెరపై పాత్రగా కాకుండా తన వ్యక్తిత్వంతో ప్రేక్షకుల ముందుకు రావడం వల్ల ఆయనకు మరింత గుర్తింపు లభించింది. ఆ తర్వాత సినిమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. 

‘లిఫ్ట్‌’తో మారిన దృష్టి

2021లో వచ్చిన ‘లిఫ్ట్‌’ కవిన్‌ కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయి. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రంలో ఆయన నటనకు మంచి స్పందన వచ్చింది. కథను మోసుకెళ్లగల నటుడిగా కవిన్‌పై పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ నమ్మకం పెరిగింది. అప్పటివరకు టెలివిజన్‌ నేపథ్యం ఉన్న యువ హీరోగా కనిపించిన కవిన్‌.. ఇక కథకు తగ్గట్టుగా పాత్రను మలుచుకోగల నటుడిగా తన ఇమేజ్‌ను మార్చుకోవడం మొదలుపెట్టారు. 

‘స్టార్‌’తో తన కథనే చెప్పుకున్నాడు

2024లో వచ్చిన ‘స్టార్‌’లో కవిన్‌ నటుడిగా ఎదగాలని కలలు కనే యువకుడి పాత్రలో కనిపించారు. సినిమా కథలోని పోరాటం, నిరాశలు, అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు.. ఇవన్నీ కవిన్‌ నిజ జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసేలా ఉన్నాయి. అందుకే ఈ పాత్ర ఆయనకు మరింత ప్రత్యేకంగా నిలిచింది. సినిమా స్పందన మిశ్రమంగా ఉన్నప్పటికీ.. కథానాయకుడిగా కవిన్‌ పరిధి పెరుగుతోందనే విషయాన్ని ఈ చిత్రం మరోసారి చాటింది. 

ఒకే ఇమేజ్‌లో ఇరుక్కోకుండా..

‘దాదా’తో విజయాన్ని అందుకున్న తర్వాత కూడా కవిన్‌ అదే తరహా పాత్రలను ఎంచుకోలేదు. ‘బ్లడీ బెగ్గర్‌’లో పూర్తిగా భిన్నమైన, వ్యంగ్య ఛాయలున్న బిచ్చగాడి పాత్రలో కనిపించారు. సినిమా వాణిజ్యపరంగా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ప్రయోగాత్మక పాత్రను ఎంచుకునే ధైర్యాన్ని మాత్రం ఈ చిత్రం చూపించింది. ఆ తర్వాత ‘కిస్‌’, ‘మాస్క్‌’ వంటి సినిమాలతోనూ తన నటనా పరిధిని విస్తరించే ప్రయత్నం కొనసాగించారు. 

నయనతారతో ‘హాయ్‌’.. మరో మలుపు

ఇప్పుడు కవిన్‌ కెరీర్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చిత్రం ‘హాయ్‌’. నయనతారతో తొలిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాకు విష్ణు ఎడవన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ప్రేమకథలోని భిన్నమైన కోణాన్ని చూపించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. నయనతారతో కలిసి నటించడం తన కెరీర్‌లో ఊహించని ప్రత్యేకమైన మైలురాయిగా కవిన్‌ చెప్పారు. కవిన్‌ ప్రతి సినిమాతో తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవాలనే ప్రయత్నమే ఆయన ప్రయాణానికి బలం. ఇప్పుడు ‘హాయ్‌’తో నయనతార వంటి అగ్ర కథానాయికతో కలిసి నటిస్తున్న కవిన్‌.. తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా అడుగేస్తున్నారు. 

‘దాదా’తో అసలైన గుర్తింపు

కవిన్‌ కెరీర్‌ను ‘దాదా’కు ముందు, ‘దాదా’ తర్వాత అని విభజించవచ్చేమో. 2023లో విడుదలైన ఈ చిత్రంలో తండ్రిగా మారిన యువకుడి భావోద్వేగ ప్రయాణాన్ని ఆయన సహజంగా ఆవిష్కరించారు. ప్రేమ, బాధ్యత, తండ్రితనం, కుటుంబం.. ఇలా అనేక భావోద్వేగాల మధ్య సాగే పాత్రలో కవిన్‌ చూపించిన పరిణతి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో కవిన్‌ కేవలం యువ కథానాయకుడు మాత్రమే కాదని, భావోద్వేగ పాత్రలను కూడా సమర్థంగా పోషించగల నటుడని నిరూపితమైంది.