లిక్కర్ స్కాంతో కవితకు లింక్.. అందుకే అరెస్ట్ : ధర్మపురి అరవింద్

లిక్కర్ స్కాంతో కవితకు లింక్.. అందుకే అరెస్ట్ : ధర్మపురి అరవింద్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్ట్ అవినీతి రహిత పాలనకు ప్రయోజనమని అన్నారు. లిక్కర్ స్కాం లో లింక్ ఉంది కాబట్టే కవిత అరెస్ట్ అవుతారని చెప్పామని అంతే కానీ కవిత అరెస్ట్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు.  అధికారంలో ఉండగా బీఆర్ఎస్ నేతలు అనేక అరాచకాలు చేశారని ఆరోపించారు. అమాయకులపై పీడీ యాక్టులు పెట్టి వేదించారని తెలిపారు.

ఆర్మూర్ లో అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ వాతావరణాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో క్రేయేట్ చేశారని ఆరోపించారు. ముస్లింలతో కలిసి ప్రధాని మోదీని హేళన చేసి మాట్లాతున్నారని మండిపడ్డారు. హిందూ వ్యతిరేకి జీవన్ రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అండతోనే పీఎఫ్ఐకి జగిత్యాల అడ్డాగా మారిందన్నారు. హిందూ వ్యతిరేక శక్తిగా తయారయ్యారని విమర్శించారు.

రోహింగ్యాలకు పౌరసత్వం ఇవ్వాలని జీవన్ రెడ్డి పోరాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. స్వాతంత్య్రం నుంచి కాంగ్రెస్ హిందువులను మోసం చేస్తూ వస్తోందని విమర్శించారు. అంబేద్కర్ రాసిన  రాజ్యాంగానికి వ్యతిరేకంగా విభజన చేశారని అరవింద్ అన్నారు.