కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర కాఫర్ డ్యామ్ నిర్మించాలి.. ప్రభుత్వానికి కవిత డెడ్‌లైన్

కన్నెపల్లి  పంప్ హౌస్ దగ్గర కాఫర్ డ్యామ్ నిర్మించాలి.. ప్రభుత్వానికి కవిత డెడ్‌లైన్

కన్నెపల్లి: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకుని రైతులను ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ద్వారా నీటి వినియోగం, సాగునీటి సరఫరా, కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీలతో పాటు రిజర్వాయర్లు, కాలువలు ఉన్నాయని కవిత అన్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద సుమారు రూ.25 కోట్ల వ్యయంతో కాఫర్ డ్యామ్ నిర్మిస్తే నెల నుంచి నెలన్నర రోజుల్లో పనులు పూర్తి చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నిర్మాణం ద్వారా మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండా గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కన్నెపల్లి పంప్‌హౌస్ పరిధిలో రోజుకు రెండు టీఎంసీల నీరు వృథాగా దిగువకు వెళ్తోందని పేర్కొన్న ఆమె, కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపడితే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నింపేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.దీనివల్ల సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు ఇప్పటికే ఉన్న ఆయకట్టును స్థిరీకరించవచ్చని వివరించారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, వానాకాలం పంటలు చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ‘మన నీళ్లు మనకు కావాలి’ అనే నినాదంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. గోదావరి, కృష్ణా నదుల జలాలను సమర్థంగా వినియోగించుకుంటే కరువు పరిస్థితులను కొంతమేర ఎదుర్కోవచ్చన్నారు.

ఈ ఏడాది పది లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్లు ప్రభుత్వం చెబుతోందని ఆమె ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులకు అవసరమైన విద్యుత్ సరఫరా కల్పించడంతో పాటు ప్రాణహిత నదిలో అందుబాటులో ఉన్న నీటిని కూడా వినియోగించుకోవాలని సూచించారు.

తెలంగాణలో సుమారు 21 వేల చెరువుల్లో నీరు లేక మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కవిత తెలిపారు. సాగునీటి అవసరాలతో పాటు చెరువుల్లో నీటి లభ్యతను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తుపాకులగూడెం ప్రాంతం నుంచి గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై కూడా దృష్టి సారించాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి వినియోగం, సాగునీటి సరఫరాపై ప్రభుత్వం తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు విమర్శలకే పరిమితం కాకుండా కరువు నివారణకు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని అన్నారు.

కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కాఫర్ డ్యామ్ నిర్మాణంపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. నెల నుంచి నెలన్నర రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించకపోతే నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. రైతులకు సాగునీరు అందించడం, ప్రస్తుత ఆయకట్టును కాపాడటం, అందుబాటులో ఉన్న గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకోవడం అత్యవసరమని కవిత అన్నారు.