- అక్కడికి కొండపోచమ్మ సాగర్ నుంచి ప్రత్యేక కాలువ
- చెరువు నుంచి నీళ్లు ఎత్తేందుకు పదుల కొద్దీ మోటార్లు
- అండర్‌గ్రౌండ్ పంపుల ద్వారా ఫాంహౌస్‌కు లిఫ్టింగ్
- ఇంకోదిక్కు కెనాల్ నుంచి 3 ఎకరాల బాయికి నీళ్లు
- ఫాంహౌస్‌కు నలుదిక్కులా అల్లుకున్న కాలువలు
- వేల కోట్ల జనం సొమ్ముతో ‘నీళ్ల కరువులేని ఫాంహౌస్’
- మరోవైపు పదేండ్లలో లక్షన్నర కోట్లు పోసినా
- కొత్తగా ఒక్క ఎకరానికీ నీళ్లివ్వని దుస్థితి!
హైదరాబాద్, వెలుగు: ‘కోటి ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణలో బాగుపడిందెవరు?’ అనే చర్చ జరుగుతున్న టైంలో ఇటీవల కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని వందల ఎకరాల్లో ఆయన, తన కుటుంబం నిర్మించుకున్న ఫాంహౌస్‌లో పెద్ద ఎత్తున ప్రభుత్వ, అసైన్డ్ భూములను కలిపేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర సర్వే
చేయిస్తోంది. ఇదిలా ఉండగా కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్ కు వాటర్‌గ్రిడ్ తరహాలో నీళ్లను మళ్లిస్తున్న వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. ఇందులో వాస్తవాలను పరిశీలించేందుకు ‘వీ6 -వెలుగు’ టీమ్ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఫాంహౌస్ ఎత్తిపోతల కోసం ఏకంగా 58 ఎకరాల్లో తవ్విన పాండురంగ చెరువును చూస్తే ‘ఔరా..’ అనిపించకమానదు. పదేండ్లలో ఇరిగేషన్‌పై లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ సర్కారు, రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఎకరానికీ నీళ్లివ్వకున్నా తన ఫాంహౌస్‌ను మాత్రం కోటి రతనాల వీణగా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది.
రంగరంగా.. పాండురంగ!
2016 ముందు కేసీఆర్ ఫాంహౌస్‌కు ఎదురుగా చెరువే లేదు. గూగుల్‌లో నాటి, నేటి ఫొటోలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. అప్పట్లో కొండపోచమ్మ సాగర్ తో పాటే సమాంతరంగా తన ఫాంహౌస్ ముందే ఈ చెరువును కేసీఆర్ తవ్వించుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ పాండురంగ చెరువు దాదాపు 58 ఎకరాల్లో విస్తరించింది. చెరువులు తవ్వడం మంచిదే. కానీ అది ఒక్కరి ప్రయోజనం కోసం కావడమే ఇక్కడ సమస్య. పాండురంగ చెరువు విషయంలోనూ అదే జరిగింది. చెరువు అవతలి గట్టున కనిపించే మోటార్లు, పైపులు దాని అసలు లక్ష్యమేంటో చెప్పకనే చెబుతున్నాయి.
చెరువు నుంచి పైపులు.. సారింటికి నీళ్లు
డ్రిప్ ఇరిగేషన్ పేరుతో పాండురంగ చెరువులోకి భారీ సంఖ్యలో పైపులు వేశారు. దగ్గరలో పంపుహౌస్ నిర్మించారు. చెరువులోంచి నీళ్లను గుంజుకునే ఈ పైపులు భూగర్భంలోకి పోయి దగ్గరలో కొండపోచమ్మ కాలువను దాటుకొని కేసీఆర్ ఫాంహౌస్ లోకి వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కోట్లుపెట్టి తవ్విన చెరువు, డ్రిప్ ఇరిగేషన్‌తో మళ్లిస్తున్న నీళ్లు కేసీఆర్ ఫాంహౌస్ సేవలో తరిస్తున్నాయి. దీని కోసమే అప్పట్లో సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల పేరుతో దాదాపు 50 కోట్ల వ్యవసాయ శాఖ నిధులను మంజూరుచేసుకున్నారు. 100 శాతం సబ్సిడీతో రైతులకు బిందుసేద్యం సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. ఆ నిధులన్నీ ఫాంహౌస్‌కే ఖర్చుపెట్టినట్లు స్పష్టమవుతోంది.
సారు కోసం బాయి.. బాయి కోసం నీళ్లు
కొండపోచమ్మ నడకలు ఇక్కడితో ఆగిపోలేదు. ప్రధాన కాలువ ఫాంహౌస్ ను దాటుకొని ముందుకు పోయాక మరొక డైవర్షన్ కాలువ కనిపిస్తుంది. అది సరిగ్గా కేసీఆర్ ఫాంహౌస్ కుడివైపున సమాంతరంగా సాగుతూ ముందుకు పోతుంది. కేసీఆర్ ఫాంహౌస్ వెనుక భాగంలో తన కోసమే తవ్వించుకున్న మూడెకరాల బాయి ఇక్కడ కీలకం. డైవర్షన్ కెనాల్ దగ్గర కనిపిస్తున్న తూముల ద్వారా నేరుగా ఫాంహౌస్ బాయిని నింపుకుంటున్నారని స్థానిక రైతులు అంటున్నారు. ఏ కాలం అయినా, ఎక్కడ నీళ్లు లేకున్నా ఈ కాలువకు నీళ్లు వచ్చేవని చెప్తున్నారు.
కుడిఎడమలా.. జలకళ
ఓదిక్కు చెరువు, ఇంకోదిక్కు కాలువ నుంచి బాయిలోకి, అక్కడి నుంచి కేసీఆర్ ఫాంహౌస్ లోని ప్రతిపంటకూ, చెట్లకూ పుష్కలంగా నీళ్లు అందుతున్నాయి. ఇక ఫాంహౌస్ కి ఎడమ దిక్కు, వెనుక దిక్కున కూడా ఏ లోటు లేకుండా ఏర్పాట్లు జరిగినట్లు కనిపిస్తోంది. కొండపోచమ్మ ప్రధాన కాలువ కేసీఆర్ ఫాంహౌస్ ముందు రోడ్డుకి చేరే దగ్గరే ఎడమవైపు మరో డైవర్షన్ కెనాల్ కనిపిస్తుంది. ఇది ముందుకు సాగుతున్న క్రమంలో ఒకచోట కుడివైపు పోయే ఇంకో చిన్న డైవర్షన్ కాలువ కనిపిస్తుంది. ఇది కేసీఆర్ ఫాంహౌస్ వెనుక భూముల మీదుగా ఎర్రవల్లి వైపు సాగిపోతుంది. ఇట్లా ఎటు నుంచి చూసినా ఫాంహౌస్ నలుదిక్కులా ఏదో రూపంలో కాలువలు కళకళలాడుతున్నాయి. ఫాంహౌస్ తోపాటు చుట్టూ ఉన్న భూములు కూడా దాదాపుగా కేసీఆర్ కుటుంబీకులు, బంధువుల చేతుల్లోనే ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. దీంతో అందరికీ కలిసొచ్చేలాగ నీళ్ల మళ్లింపు ఏర్పాట్లు ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.
కొండపోచమ్మ అసలు కథ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కేసీఆర్ ఫాంహౌస్ కి దగ్గరలో కొండపోచమ్మ సాగర్ నిర్మించారు. 15 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ ని 2018 మొదలుపెట్టి 2020లో పూర్తిచేశారు. పైన ఉన్న మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తీసుకోవాలని మొదట్లో డిజైన్ చేశారు. కానీ విచిత్రంగా మల్లన్నసాగర్ పూర్తికావడానికి ముందే కొండపోచమ్మ సాగర్ ను పూర్తిచేశారు. కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లు మళ్లించుకునేందుకు మల్లన్నసాగర్ మధ్యంలోంచి భారీ కెనాల్ తవ్వారు. ఇందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేశారు. దీనిపై అప్పట్లో ఆరోపణలు వచ్చినప్పటికీ కేసీఆరే సీఎంగా ఉండడం వల్ల ఎవరూ విచారించే పరిస్థితి లేదు. పైకి మాత్రం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లోని ఆయకట్టుకు నీళ్లివడానికే ఈ రిజర్వాయర్ నిర్మించినట్లు చెప్పారు.
లోగుట్టు కొండపోచమ్మకే ఎరుక
కేసీఆర్ ఫాంహౌస్‌కు కనుచూపు మేరలోనే కొండపోచమ్మ సాగర్ ఉంటుంది. దాదాపు 5 కిలోమీటర్ల దూరం. ఈ రిజర్వాయర్ నుంచి మొదలయ్యే ప్రధాన కాలువను ‘జగదేవ్‌పూర్ కెనాల్’ అంటారు. మొదట్లో భవానందపూర్, శివారు వెంకటాపూర్ అనే చిన్న గ్రామాలు మాత్రమే ఉంటాయి. అవి దాటగానే నేరుగా కేసీఆర్ ఫాంహౌస్ ముందు రోడ్డుకు సమాంతరంగా ఈ కాలువ సాగిపోతుంది. ఫాంహౌస్ ముందే ఈ కాలువకు సమాంతరంగా మరో చిన్న డైవర్షన్ కెనాల్ నిర్మించారు. ఇది సరిగ్గా ఫాంహౌస్‌కు ఎదురుగా ఉండే పాండురంగ చెరువులోకి పోతుంది. కొండపోచమ్మ కాలువ నీళ్లను మళ్లించి ఈ చెరువును నింపుతున్నారు. గూగుల్ మ్యాపులో పేరు కూడా కనిపించని ఈ చెరువే కేసీఆర్ ఫాంహౌస్‌కు ప్రధాన నీటి వనరు.
ఎల్‌నినో వల్ల ఈసారి వానల్లేక అటు దేశం, ఇటు తెలంగాణల ఎటుచూస్తే అటు కరువే దరువేస్తున్నది. చూస్తుండంగనే చెరువులు, డ్యామ్‌లు, రిజర్వాయర్లు, బోర్లళ్ల నీళ్లు ఇంకిపోతున్నయ్. చాలాచోట్ల నీటి జాడలేక చేతికచ్చిన పంటలు ఎండిఎరగప్పయితన్నయ్. వచ్చే ఏడెనిమిది నెలలు జనానికి గుక్కెడు తాగునీరు ఎట్లా ఇవ్వాల్నో తెల్వక సర్కారు తలపట్టుకుంటున్నది. ఇట్లాంటి టైంల ఓ ప్రాంతం మాత్రం కళకళలాడే చెరువు, నిండుకుండలాంటి బాయి, గలగలపారే కాల్వలు, పైపులైన్లతో వందల ఎకరాల్లో పచ్చదనంతో అలరారుతోంది. అది సహజంగా జరిగితే అద్భుతమే. కానీ పదేండ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకొని , వందల కోట్ల జనం సొమ్ముతో ఒక్క వ్యక్తి తన సొంతానికి చేసుకున్న ఏర్పాటు!!అదే సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్.
జనం సొమ్ముతో డ్రిప్.. సారింట్లో డ్రాప్
పాండురంగ చెరువు నుంచి నీళ్లు మళ్లించడానికి వ్యవసాయ శాఖ నుంచి భారీగా నిధులను ఖర్చుపెట్టారు. దీనికి నిదర్శనంగా 2016, 2017లో ఇచ్చిన మూడు జీవోలున్నాయి. 2016 జనవరి 5న ఇచ్చిన జీవో 2 ప్రకారం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను మోడల్ గ్రామాలుగా గుర్తించి వీటిలో 3వేల ఎకరాల్లో బిందుసేద్యం కోసం ఏర్పాట్లు చేయాలి. ఇందుకు100 శాతం సబ్సిడీ ఇస్తూ మొత్తం ఖర్చు సర్కారే పెడుతుందని చెప్పారు. మొదట్లో 42.54 కోట్లతో పాలన అనుమతి ఇచ్చారు. తర్వాత 2016 ఏప్రిల్ 7న జీవో 149 జారీ చేశారు. దీని ప్రకారం ఈ ప్రాజెక్టు అమలుకు నెటాఫిమ్ అనే ప్రైవేటు కంపెనీతో ఎంవోయూ చేసుకున్నారు. ఖర్చు అంచనాను రూ.49.89 కోట్లకు పెంచి ఆమోదించినట్లు చెప్పారు.
ఇందులో 25 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించారు. మూడునెలల్లోనే అంచనాలు రూ.7.35 కోట్లు పెంచారు. దీనికి కారణాలు చెప్పలేదు. తర్వాత 2017 జనవరి 30న సవరణ జీవో 49 ఇచ్చారు. కొన్ని నిబంధనల్లో మార్పులతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్శిటీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వి.ప్రవీణ్ రావు నేతృత్వంలోని కమిటీ ధ్రువీకరిస్తే చెల్లింపులు చేస్తామని చెప్పారు. ముందు జీవోలో ఉచితం అని ఉన్న నెటాఫిమ్ సేవలకు చెల్లింపుల ఒప్పందం చేసుకోవాలని సవరణ జీవోలో ఉంది. ఇంత ఖర్చుపెట్టే ప్రాజెక్టుకు టెండర్ ప్రస్తావన లేకుండా నేరుగా నెటాఫిమ్ కు అప్పగిస్తూ జీవో ఇచ్చారు.
‘ఎకరాకు కోటి’ ఉపాయం ఇదేనా
తెలివిగా వ్యవసాయం చేస్తే ఎకరానికి కోటి రూపాయలు సంపాదించవచ్చని గతంలో కేసీఆర్ చెప్పారు. తాను స్వయంగా వ్యవసాయం చేసే పెద్ద రైతునని అభివర్ణించుకున్నారు. అంత పెద్ద నాయకుడు చెబితే నిజమేనని చాలామంది నమ్మారు. కానీ ఎకరానికి కోటి రూపాయలు ఎట్లా సంపాదించాలన్నది మాత్రం ఇన్నేళ్లలో ఎవరికీ అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే కోటి సంపాదన సాధ్యమే కావచ్చని అనిపిస్తోంది. వేలకోట్ల జనం సొమ్ముతో రిజర్వాయర్, భారీ కెనాల్, చెరువులు, నీళ్లు నేరుగా పొలానికి తెచ్చిపోసేలా ఏర్పాట్లు ఉంటే పంట ఆదాయం మొత్తం లాభమే కదా! ఉచితంగా సలహాలిచ్చే వ్యవసాయ నిపుణులు కూడా ఉంటే రాబడి కోట్లలో ఉండే అవకాశం లేకపోలేదు. కేసీఆర్ వ్యవసాయంలో లాభాల అసలు రహస్యం బహుశా ఇదేనేమోననే చర్చ జరుగుతోంది.
కెనాల్ నీళ్లు డైరెక్ట్‌గా ఫాంహౌస్‌కే
కొండపోచమ్మ సాగర్కేలి ఆలేరు భువనగిరి పోయే కెనాల్ఇప్పినమనుకో నీళ్లు డైరెక్ట్ వచ్చి ఫాం హౌస్ లకే పోతయి. ఒక్కొక్కటి ఆరెకరాలు, ఏడెకరాలు, ఎనిమిదెకరాలు మడి ఉంటది. ఆ మడుల చుట్టూ ఊళ్లల్ల మోరీ ఉన్నట్టు సీసీ కెనాల్స్ ఉంటయి. వాటర్ ఇప్పంగనే ఎటుయటు ఎళ్లిపోతయి. మడి మడికి ఇదే గేట్లు ఉంటయి. - శ్రీధర్, రైతు
చెరువుల కేంచి పైపు లైను తోని బావిని నింపుకుంటడు
ఈ బాయి మూడు ఎకరాలుంటది. కేసీఆర్ సీఎం అయినంక ఫస్ట్ తవ్వించుకున్నడు. కొండపోచమ్మసాగర్నుంచి పాండురంగ చెరువులోకి నీళ్లు వస్తయి. చెరువుల కేంచి పైపు లైను తోని బావిని నింపుకుంటడు. బావిలకేలి ఫాంహౌస్ పారించుకుంటడు.. - శ్రీను, రైతు
రైతుల కోసం ఆలోచన చేస్తలేడు.
కేసీఆర్‌కు మూడెకరాల బాయి ఉంది. మా ఉళ్లోనే ఇద్దరు ముగ్గురు రైతుల పొలాలు ఎండిపోయినయి. వాళ్లకు కూడా ఇక్కడ నుంచి పైపులేసి నీళ్లు ఇయ్యచ్చుకదా. ఇదంతా ప్రజలకోసమే చేస్తున్న అని ఆయన చెప్తడు కదా.. మరెందుకో రైతుల కోసం ఆలోచన చేస్తలేడు. - మధు, రైతు
ఫామ్ హౌస్ చేయవట్టి 10, 15 విలేజ్‌లకు నీళ్లు లేవు
మేయిన్ గేటు కాడ ఉండె నాభూమి.. ఐదెకరాల 15 గుంటల భూమి.. నన్నయితే మోసం చేసిండ్రు సార్ వాళ్లు. నాకు నీళ్లు ఇస్తనంటెనే 43 లక్షల కాడికి ఇచ్చిన.. లేకుంటే ఇయ్యకనేపోదు. ఫామ్ హౌస్ చేయవట్టి 10, 15 విలేజ్‌లకు వాటర్ లేవు.
- కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలోని రైతు
