కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో ప్రవీణ్ ఎస్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సత్యవన్ సావిత్రి’. ఇదొక కోర్ట్ రూమ్ థ్రిల్లర్. తమిళ దర్శకుడు మిస్కిన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కీర్తి, మిస్కిన్ లాయర్లుగా నటిస్తున్నారు. బుధవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. జులై 24న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
నిజానికి ఇదే రిలీజ్ డేట్‌కు రాజ్ కుమార్ రావ్‌కు జంటగా ఆమె నటిస్తున్న హిందీ చిత్రం ‘రఫ్తార్’ విడుదల కావల్సి ఉంది. అయితే ఇటీవలే ఈ చిత్రాన్ని అక్టోబర్ 16కు వాయిదా వేశారు. అనూహ్యంగా అదే రిలీజ్ డేట్‌లో కీర్తి నటించిన తమిళ సినిమా ‘సత్యవన్ సావిత్రి’ వస్తోంది. తన భర్త కేసును వాదించే లాయర్ సావిత్రిగా కీర్తి నటిస్తోంది.
న్యాయం కోసం తన సీనియర్ అయిన మిస్కిన్‌తో ఆమె కోర్టు రూమ్‌లో తలపడుతుంది. ‘హార్ట్ బీట్’ సిరీస్ ఫేమ్ చారుకేష్ ఇందులో కీర్తికి భర్తగా నటించాడు. బాలాశరవణన్, శిల్పా మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. డ్రమ్ స్టిక్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక విజయ్ దేవరకొండకు జంటగా ‘రౌడీ జనార్ధన్’, మలయాళంలో ‘తోట్టం’ సినిమాలు చేస్తోంది కీర్తి సురేష్.
