- పేదలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్, వామపక్షాల డిమాండ్
- ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఖమ్మం, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన పేదలకు న్యాయం చేయాలని, ఇందిరమ్మ కమిటీలను రద్దుచేసి లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు.
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు, సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు భాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేశ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, బానోతు చంద్రావతి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి పుల్లయ్య, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారు ఐలయ్య మాట్లాడారు. సంక్షేమ పథకాలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం సరికాదన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను తప్పనిసరిగా గ్రామసభల ద్వారానే చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ గ్రామాల వారీగా అర్హులైనప్పటికీ ఇండ్లు మంజూరు కాని లబ్ధిదారుల ఫొటోలు, వివరాలను ప్రదర్శించారు. తర్వాత నాయకులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్ దివాకర్ కు వినతిపత్రం సమర్పించారు.
