రైతు కష్టాలు: ఖమ్మం జిల్లాలో 5 కి.మీ. దూరం నుంచి ట్యాంకర్‌‌‌‌తో వరికి నీళ్లు..

రైతు కష్టాలు: ఖమ్మం జిల్లాలో 5 కి.మీ. దూరం నుంచి ట్యాంకర్‌‌‌‌తో వరికి నీళ్లు..
  • వేంసూరు మండలం కందుకూరులో పంటల దయనీయ పరిస్థితి
  • 12 గుంటల పొలాన్ని కాపాడుకుంటున్న రైతు దంపతులు

వేంసూర్, వెలుగు :  ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరులో సాగునీరు అందక చేతికొచ్చిన వరి పంట ఎండిపోతుండటంతో అడసర్లపాడు గ్రామానికి చెందిన కొలికపోగు రత్తయ్య, సునీత దంపతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకున్న 12 గుంటల భూమిలో ఎంతో కష్టపడి సాగు చేసిన పంట చివరి దశకు చేరుకున్న తరుణంలో నీటి కొరత వారి ఆశలపై నీళ్లు చల్లుతోంది. 

పెట్టిన పెట్టుబడి, ఆరుగాలం చేసిన శ్రమ వృథా కాకూడదనే ఉద్దేశంతో ఆ దంపతులు ఏకంగా 5 కిలోమీటర్ల దూరం నుంచి ట్రాక్టర్‌‌‌‌ ట్యాంకర్‌‌‌‌ ద్వారా నీటిని తెచ్చి తమ పొలానికి అదనపు ఖర్చుతో తడులు అందిస్తున్నారు. చిన్న పొలమే అయినా కుటుంబానికి భరోసా ఇస్తుందన్న ఆశతో వారు చేస్తున్న ఈ సాహసం అందరినీ కదిలిస్తోంది. కీలక సమయంలో సాగునీరు అందక వ్యవసాయం భారంగా మారుతోందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆదుకోవాలని ఆ రైతు దంపతులు కోరుతున్నారు.