- ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి కష్టాలు
- ఇప్పడురైతులకు కొత్త సమస్య!
కొణిజర్ల, వెలుగు: ఎల్‌నినో ప్రభావం వల్ల సాగర్ నీరు, ప్రాజెక్టుల సరఫరా లేక బోర్లపై ఆధారపడి పంటలు పండిస్తున్న పల్లిపాడు రైతులకు దొంగల బెడద పెద్ద సమస్యగా మారింది. ఈ నెల 12 నుంచి 21వ తేదీ మధ్య గ్రామంలో వరుసగా జరిగిన దొంగతనాల్లో సుమారు 50 మంది రైతులకు సంబంధించిన సర్వీస్ వైర్లు, మోటార్ల స్టార్టర్లు, ఫ్యూజులు, కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి.
విద్యుత్ స్తంభాల నుంచి బోర్ల వరకు ఉన్న వైర్లను సైతం వదలకుండా ఎత్తుకెళ్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగునీటి సమస్యతో సతమతమవుతున్న తమకు, ఈ దొంగతనాల వల్ల అదనపు ఆర్థిక భారం పడి వ్యవసాయం చేయడం భారంగా మారిందని వాపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై గుగులోత్ సూరజ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
