డీలిమిటేషన్ పై అఖిలపక్ష భేటీ పెట్టండి .. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

డీలిమిటేషన్ పై అఖిలపక్ష భేటీ పెట్టండి .. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

న్యూఢిల్లీ: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్​) అంశంపై కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త ప్రతిపాదనలపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీని కోరారు. సుదూర ప్రభావాలు చూపే రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో బలవంతంగా ఆమోదించుకోవాలని చూడొద్దని ఆయన హెచ్చరించారు.

 వర్షాకాల సమావేశాలు ముగిసి 64 రోజులు గడుస్తున్నా.. ఉభయ సభలను ఇంకా అధికారికంగా ప్రొరోగ్‌‌‌‌‌‌‌‌ చేయకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఖర్గే రాసిన లేఖను కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. 

డీలిమిటేషన్ బిల్లును ప్రతిపాదించడానికి ముందే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని తాను తొలిసారిగా ఏప్రిల్ 11న కోరినట్లు ఖర్గే గుర్తుచేశారు. ఏప్రిల్ 14న రాత్రి బిల్లులను తెచ్చి, ఏప్రిల్ 16న ప్రత్యేక సమావేశాలు నిర్వహించినప్పటికీ.. తగిన మెజారిటీ రాకపోవడంతో ఏప్రిల్ 17న లోక్‌‌‌‌‌‌‌‌సభలో ఆ బిల్లు వీగిపోయిందని ఆయన తెలిపారు. 

ఆ తర్వాత జూలై 16, ఆగస్టు 27 తేదీల్లోనూ కేంద్రానికి లేఖలు రాశానని, ఇప్పుడు నాలుగోసారి అఖిలపక్ష భేటీని కోరుతున్నానని పేర్కొన్నారు. కొత్త ప్రతిపాదనలను పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో ప్రవేశపెట్టే ముందు రాజకీయ పార్టీలకు, ఇతర భాగస్వామ్య పక్షాలకు చర్చించుకోవడానికి తగినంత సమయం ఇవ్వాలని ఖర్గే విజ్ఞప్తి చేశారు.