- రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యమే కాంగ్రెస్ లక్ష్యం
- ఢిల్లీలో నిరసనలతో దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నరు
- ‘సర్’తో బోగస్ ఓట్లు తొలగిస్తే తప్పేంటి?
- కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఫైర్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటమికి ఈసీ, సీజేఐని బాధ్యులను చేస్తరా? అని కాంగ్రెస్ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిరసనల పేరిట చేస్తోన్న డ్రామాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. దేశంలో అరాచకం సృష్టించి, రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.
దేశ రాజధానిలో నిరసనలతో దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నారన్నారు. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘‘గతంలో స్పీకర్ను, ఆ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)ను రాజీనామా చేయాలన్నారు. ఇప్పుడు తమకు అనుకూలంగా తీర్పులు రాలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని బెదిరిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఈసీ, సీజేఐలు బాధ్యత వహించాలా? వారేమైనా కాంగ్రెస్ను గెలిపించాలా? దేశం ఏమైనా గాంధీ కుటుంబ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపర్టీయా?” అని ప్రశ్నించారు.
‘సర్’పై ద్వంద్వ వైఖరి ఎందుకు?
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)పై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని కిషన్రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా చనిపోయిన 2.8 కోట్ల మందిని, స్థానికత మారిన 6.3 కోట్ల మందిని, రెండు చోట్ల ఓట్లున్న కోటి మందిని గుర్తించి తొలగించడంలో తప్పేముందని అడిగారు. తెలంగాణలో ‘సర్’ చేపడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వ అధికార యంత్రాంగమేనని గుర్తుచేశారు.
తమిళనాడు, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. 200 మంది అధికారుల పేరిట రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా బెదిరింపులకు దిగుతున్నారని కిషన్రెడ్డి మండిపడ్డారు. ఓట్లు పోయాయని గగ్గోలు పెడుతున్న నేతలు మీ పార్టీ బీఎల్ఏలు ఏంచేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.
అభివృద్ధిని అడ్డుకునే కుట్ర
పండుగల వేళ ఢిల్లీ మార్కెట్లను స్తంభింపజేసి సామాన్య వ్యాపారులను రోడ్డున పడేశారని, విదేశీ శక్తులతో చేతులు కలిపి పెట్టుబడులను, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని కిషన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ధర్నాలకు కనీస అనుమతి ఇవ్వని సీఎం రేవంత్రెడ్డి, ఢిల్లీకి వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ఒక్కో పౌరుడికి ఒక్కటే ఓటు ఉండేలా బోగస్, డూప్లికేట్ ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్య రక్షణకేనని స్పష్టం చేశారు. ఎవరికి ఓటు వేయాలో ఆలోచించుకునే హక్కు, అధికారం 140 కోట్ల మంది ప్రజలకు ఉన్నదన్నారు. ‘‘మీ పార్టీకి ప్రజలు ఓటేయకపోతే ఎన్నికల కమిషన్ను బాధ్యులను చేయడం సరికాదు. దేశంలో కాంగ్రెస్ రాచరికం సాగదు.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా వ్యవస్థలు పనిచేస్తాయి. ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. రాహుల్ గాంధీ అనుకున్నట్టు, విదేశీ శక్తులు అనుకున్నట్టు దేశంలో వ్యవస్థలు నడవవు” అని వ్యాఖ్యానించారు.
