చెత్త సేకరణ ప్రైవేటుపరం చేయొద్దు.. ప్రొఫెసర్ కోదండరాం

చెత్త సేకరణ ప్రైవేటుపరం చేయొద్దు.. ప్రొఫెసర్ కోదండరాం

పంజాగుట్ట, వెలుగు: చెత్త సేకరణను ప్రైవేట్​పరం చేయొద్దని, ప్రస్తుతం పని చేస్తున్న స్వచ్ఛ కార్మికులకే మరిన్ని సదుపాయాలు కల్పించి ఆదుకోవాలని, ఈ విషయమై ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడుతానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్​కోదండరాం అన్నారు. గురువారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్లు, రిక్షా డ్రైవర్ల జేఏసీ ఆధ్వర్యంలో ‘కార్మికుల హక్కులు కాపాడండి..చెత్త సేకరణ ప్రైవేటీకరించొద్దు’ అనే అంశంపై రౌంటేబుల్​సమావేశం నిర్వహించారు. దీనికి కోదండరాం ముఖ్య అతిథిగాహాజరై మాట్లాడారు. 

జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 60 వేల కుటుంబాలు 40 ఏండ్ల నుంచి చెత్త సేకరిస్తున్నారన్నారు. ఇప్పుడు వారిని కాదని, రాంకీకి అప్పగించడం వల్ల ప్రైవేట్​సంస్థలు బలోపేతం అవుతాయని, కార్మిక కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ప్రముఖ సామాజికవేత్తలు వర్గీస్​, సజయా, మీరా సంఘమిత్ర, మానవ హక్కుల నేత జీవన్​కుమార్​, అనిల్, జీహెచ్​ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్లు, రిక్షా డ్రైవర్ల జేఏసీ లీడర్లు చెవిటి వెంకన్న, వీరేష్​, రమేశ్ స్వచ్ఛ జయలక్ష్మి, రాంబాబు, నరేష్​, కలమడుగు రాజేందర్​, యాదగిరి పాల్గొన్నారు.