కోల్ కతా టెంపుల్ తొక్కిసలాట.. ఏడుగురు దుర్గా పండల్ నిర్వహకులు అరెస్ట్

కోల్ కతా టెంపుల్ తొక్కిసలాట.. ఏడుగురు దుర్గా పండల్ నిర్వహకులు అరెస్ట్

కోల్ కతాలోని చోర్ బాగ్లో దుర్గామాత పూజా పండాల్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో కేసునమోదు చేసిన పోలీసులు ఏడుగురు పండాల్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులుగా పండాల్ నిర్వాహకులపై భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్లు 105, 110, 3(5) కింద సుమోటో కేసు నమోదు చేశారు. ఇంకా కొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉంది. 

ఈ కేసులో నిర్వాహకులు రాజ్ కుమార్ సేవ్డా , శాంతనుదుబే, బిప్లబ్ ముఖర్జీలతోపాటు జనాలను నియంత్రించడంలో విఫలమైనందుకు వీఐపీ పాస్ చెకింగ్ విభాగంలో కౌశిక్, పింటూ ఉన్నారు.  ప్రైవేట్ సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌లు సుమన్ చక్రవర్తి, రాజేష్ పాల్ లను కూడా అరెస్ట్ చేశారు. 

ఇదిలా ఉండగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా , పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై కోల్ కతా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, గ్రూప్ డి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ  ఇచ్చారు. 

మరోవైపు ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు కోల్ కతా పోలీసులు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు.  నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారినిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.