Kona Venkat: పాన్ ఇండియా మోజులో హీరోలు.. ఒక ప్లానింగ్, పద్ధతి లేని డైరెక్టర్లపై కోన వెంకట్ ఫైర్!

Kona Venkat: పాన్ ఇండియా మోజులో హీరోలు.. ఒక ప్లానింగ్, పద్ధతి లేని డైరెక్టర్లపై కోన వెంకట్ ఫైర్!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, రచయిత కోన వెంకట్ సినీ పరిశ్రమలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల రన్‌టైమ్ మితిమీరిపోవడం ,సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల నిర్మాతలు వందల కోట్ల రూపాయలు నష్టపోతున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

సినిమా తీసేటప్పుడు దర్శకులకు కనీస స్పృహ, బాధ్యత ఉండాలి అని కోన వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం తీస్తున్నామో అనే క్లారిటీ లేకపోతే ఎలా? ఏకంగా 3 గంటల 50 నిమిషాల నిడివితో సినిమా తీసి, ఎడిటింగ్ టేబుల్ వద్ద 2 గంటల ఫుటేజ్‌ను పక్కన పడేస్తే ఎవరికి ఉపయోగం? అని ప్రశ్నించారు. దానివల్ల నిర్మాతలకు వందల కోట్ల నష్టం వాటిల్లుతోంది. అలాంటి నిర్లక్ష్యపూరితమైన దర్శకులను సినీ ఇండస్ట్రీ నుంచి పూర్తిగా బ్యాన్ చేయాలి. నిర్మాతల కొంపముంచే అలాంటి దర్శకులు క్రిమినల్స్‌తో సమానం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

అంతేకాకుండా హీరోలు పాన్-ఇండియా మోజులో పడి ఏళ్ల తరబడి ఒక్క సినిమాకే పరిమితమవుతున్నారని కోన వెంకట్  ఫైర్ అయ్యారు. ఏడాదికి కనీసం రెండు సినిమాలు తీస్తేనే పరిశ్రమలో వర్కర్లకు, ఇండస్ట్రీకి ఫీడ్ జనరేట్ అవుతుందని స్పష్టం చేశారు. గతంలో రెండు మూడూ చిత్రాలు తీసే హీరోలు కూడా ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలకు ఒకటి తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా స్థాయిలో సినిమాల నిడివి 3 గంటలు దాటుతోంది. 2 గంటల 30 నిమిషాలు ఉండాల్సిన కథలను అనవసరంగా సాగదీస్తూ వస్తున్న భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడి కోట్లాది రూపాయల నష్టాలను తెచ్చిపెట్టాయి. రన్ టైమ్ పెరిగి ఎడిటింగ్ లో భారీ భాగం లేచిపోవడం వల్ల కంటెంట్ దెబ్బతిని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.

సినిమా హిట్ అయితే ఓకే గానీ, ప్లాప్ అయితే వందల కోట్లు పెట్టిన నిర్మాతలు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. దర్శకులు సరైన ప్లానింగ్‌తో, సీన్లపై స్పష్టతతో వ్యయం తగ్గించి సినిమాలు తీస్తేనే టాలీవుడ్ మనుగడ సాధ్యమని కోన వెంకట్ చేసిన హెచ్చరికలు ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి