మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారు: కన్నీరు పెట్టుకున్న కొండా సుస్మిత

మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారు: కన్నీరు పెట్టుకున్న కొండా సుస్మిత

కొండా సురేఖ భర్తరఫ్ వ్యవహారంపై ఆమె కూతురు కొండా సుస్మిత స్పందించారు. మంత్రి పదవి నుంచి తొలగించడంపై 2026 సెప్టెంబర్ 6న వీడియో రిలీజ్ చేశారు. తన తల్లి ఏం తప్పు చేసిందని ఇంత అవమానించారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

అమ్మా, నాన్నా నన్ను క్షమించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ భోరున ఏడ్చిన వీడియో రిలీజ్ చేశారు కొండా సుస్మిత . పార్టీలో నేనైనా ఉండాలి, ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి ఒక ముఖ్యమంత్రి దిగజారుతాడా? నేను మాట్లాడిన మాటల్లో తప్పులేదని ఇప్పటికీ చెప్తున్నాను. ఒకవేళ తప్పు ఉన్నా కూడా, నా తప్పు కాబట్టి నామీద అక్రమ కేసు పెట్టి నన్ను జైల్లో వేయాల్సింది.. కానీ మా అమ్మను ఎందుకు అవమానించారని ప్రశ్నించారు. 

ఒక సామాన్య కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన మహిళపై రేవంత్ రెడ్డి ఇంత పగ పెట్టుకుంటాడని అనుకోలేదని అన్నారు. తాను పార్టీని ఎక్కడ కించపరచలేదని.. కేవలం ఒక వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడానని అన్నారు. తన తల్లి చేసిన  ఒక్క తప్పు చూపించండి.. తన శాఖలో చిన్న అవినీతి కూడా జరగలేదని అన్నారు. 

రేవంత్ రెడ్డిని తిట్టమని మా అమ్మ, అతని సహచర మంత్రి ఎందుకు చెప్తుంది? ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్న మా నాన్న రేవంత్ రెడ్డిని తిట్టమని ఎందుకు చెప్తాడు? అధిష్టానం మొత్తం మా అమ్మకే మద్దతుగా ఉంది.. కానీ రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేయడం వల్లనే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి సోదరుల అక్రమాల చిట్టా తన దగ్గర ఉందని.. దాని గురించి తర్వాత మాట్లాడతానని అన్నారు. మా అమ్మ, నాన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు.. మా అమ్మను ఇంత అవమానిస్తారని తెలిస్తే అలా మాట్లాడేదాన్ని కాదు.. అంటూ భావోద్వేగానికి గురయ్యారు.