ఒకప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది డాల్గోనా కాఫీ. తర్వాత బబుల్ టీ, రామెన్, కొరియన్ నూడుల్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరింది కొరియన్ ఐస్ కప్. హైదరాబాద్‌లోని కొన్ని స్టోర్లలో ఈ ట్రెండ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, కే-డ్రామా ఫ్యాన్స్, కంటెంట్ క్రియేటర్లు ఈ కొత్త టేస్ట్‌ను ఆస్వాదించేందుకు రెడీ అవుతున్నారు.సత్య నాలెడ్జ్ సిటీలోని క్యూ-మార్ట్ కన్వీనియోలో ఈ ఐస్ కప్స్ కోసం యూత్ క్యూ కడుతోంది.
మధురానగర్, ఏఎస్ రావునగర్ ప్రాంతాల్లోని కొన్ని దిగుమతి చేసిన ఆహార ఉత్పత్తులు విక్రయించే స్టోర్లలో కూడా ఇవి కనిపిస్తున్నాయి. తాగడానికే కాదు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికీ చాలామంది ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.ఇది కొత్త విషయం కాదు. దక్షిణ కొరియాలోని కన్వీనియెన్స్ స్టోర్లలో చాలా కాలంగా ఐస్‌తో నింపిన ప్లాస్టిక్ కప్పులు అమ్ముతుంటారు. కస్టమర్లు వాటితోపాటు కాఫీ, జ్యూస్, సోడా లేదా పౌచ్ డ్రింక్ కొని ఐస్ కప్పులో పోసుకుని తాగుతారు. అక్కడ ఇది రోజువారీ లైఫ్ స్టైల్లో భాగం. అయితే సోషల్ మీడియా వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం ట్రెండ్‌గా మారింది.
రుచి కంటే అనుభవానికే ఎక్కువ మార్కులు
ఈ డ్రింక్ రుచి కొందరికి చిన్ననాటి రస్నా లేదా ఫ్రూట్ డ్రింక్‌లను గుర్తు చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా దీనిపై సరదా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ‘‘ఇంటినుంచి ఐస్ తీసుకెళ్తే డిస్కౌంట్ ఇస్తారా?’’ అని కొందరు జోక్ చేస్తుంటే, మరికొందరు ‘‘వీడియో కోసం ఒకసారి ట్రై చేయొచ్చు’’ అంటున్నారు. మొత్తానికి, కొరియన్ ఐస్ కప్ అనేది కొత్త డ్రింక్ కంటే కొత్త అనుభవం. కే-కల్చర్, సోషల్ మీడియా, అందమైన ప్రజెంటేషన్, కొత్తదనం.. ఈ నాలుగు కలిసి హైదరాబాద్‌లో ఈ ట్రెండ్‌ను హాట్ టాపిక్‌గా మార్చేశాయి.
ఇందులో ప్రత్యేకత ఏంటి?
ముందుగా ఐస్‌తో నిండిన కప్పు తీసుకోవాలి. తర్వాత నచ్చిన పౌచ్ డ్రింక్ ఎంచుకోవాలి. బ్లూబెర్రీ, గ్రీన్ ఆపిల్, మామిడి, స్ట్రాబెర్రీ, గ్రీన్ గ్రేప్, ఆరెంజ్ ఏడ్, బనానా మిల్క్ వంటి ఎన్నో ఫ్లేవర్లు అందుబాటులో ఉంటాయి. పౌచ్‌ను కట్ చేసి ఐస్ కప్పులో పోసి, స్ట్రా పెట్టుకుని తాగడమే. ఇందులో రుచి మాత్రమే కాదు. ఐస్ మీద రంగురంగుల డ్రింక్ పడే దృశ్యం, నెమ్మదిగా కలిసే రంగులు, చివర్లో స్ట్రాతో తాగే క్షణం.. ఇవన్నీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌కు బాగా సరిపోతాయి. అందుకే ఈ ట్రెండ్ వేగంగా వైరల్ అయింది. దీని ధర రూ.235. అయితే అది కేవలం ఐస్కప్ ధర కాదు.. ఐస్ కప్‌తోపాటు దిగుమతి చేసిన కొరియన్ పౌచ్ డ్రింక్‌తో కలిపిన ధర. కొరియాలో ఇవి తక్కువ ధరకే లభిస్తాయి. అయితే భారత్‌లో దిగుమతి ఖర్చులు, స్టోర్ నిర్వహణ వ్యయం వంటి కారణాలతో ధర పెరుగుతోంది.
