రాజస్థాన్ కోటాలో జేఈఈ విద్యార్థుల మధ్య ఘర్షణ.. బొమ్మ తుపాకీతోవిద్యార్థిపై దాడి, తీవ్రగాయాలు

రాజస్థాన్ కోటాలో జేఈఈ విద్యార్థుల మధ్య ఘర్షణ.. బొమ్మ తుపాకీతోవిద్యార్థిపై దాడి, తీవ్రగాయాలు

రాజస్థాన్‌లోని కోటాలో 11వ తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ కలకలం రేపుతోంది. కోటాలోని అలెన్‌ సబల్ కోచింగ్ సెంటర్ క్యాంపస్‌లో జేఈఈ పరీక్షకు తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన  ఘర్షణలో  ఓవిద్యార్థి తోటి విద్యార్థిపై దాడి చేయడంతో హింసాత్మకంగా మారింది. ఈదాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తుపాకీతో  విద్యార్థిపై దాడి చేసినట్లు దృశ్యాలు  కనిపిస్తున్నాయి. ఈ దాడిలో విద్యార్థికి తీవ్రగాయాలు కాగా చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం(అక్టోబర్16) అలెన్‌ సబల్ కోచింగ్ సెంటర్ క్యాంపస్ లో  విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల వీడియో వైరల్ కావడంతో హాట్ టాపిక్ గా మారింది.  

యూపీకి విద్యార్థికి, బిహార్ కు చెందిన మరో విద్యార్థికి మద్య ఈ ఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. బొమ్మ తుపాకీతో విద్యార్థి తలపై గట్టిగా కొట్టడంతో తల వెనకభాగంలో గాయంతో తీవ్ర రక్తస్రావమైనట్లు వీడియోలో కనిపిస్తోంది. గాయపడిన విద్యార్థిని వెంటనే కోచింగ్ సిబ్బంది, విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకగా ఉన్నట్లు సమాచారం. 

కాల్పులు జరిగాయంటూ ప్రచారం.. 

ఘటన సమయంలో తుపాకీతో కాల్పులు జరిపారనే వదంతులు వ్యాపించడంతో క్యాంపస్‌లో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అలెన్‌ టీషర్టులు ధరించిన విద్యార్థులు భయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఈ ఘటనలో నిజమైన తుపాకీని ఉపయోగించలేదని స్పష్టం చేశారు. విద్యార్థుల కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు.

కోటా కోచింగ్‌ కేంద్రాల్లో భద్రతపై ఆందోళన

దేశవ్యాప్తంగా జేఈఈ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వేలాది మంది విద్యార్థులు రాజస్థాన్‌లోని కోటాకు వెళ్తుంటారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తీవ్రమైన చదువుల ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థుల మధ్య ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, కోచింగ్‌ కేంద్రాల్లో నిఘాపై మరోసారి చర్చకు దారితీశాయి.