‘‘సినిమా’’(CINEMA) అంటే.. ఎంతోమందిని ఒక్కటిగా కలిపే ఓ వేదిక. మరెంతో మందికి అన్నం పెట్టె ఓ సాధనం. ఇంకెంతోమంది జీవితాలకు ఓ కొత్త అర్థాన్ని ఇచ్చే ఓ కల. నిజానికి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఎలాగైనా నటులు అవ్వాలని, సినిమా డైరెక్ట్ చేయాలని, సంగీతం అందించాలని, ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్.. ఇలా ప్రతి క్రాఫ్ట్ లో.. టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని కొత్త వాళ్ళు తపిస్తూనే ఉంటారు. అలా సినిమా ఛాన్స్ అందుకోవడం కోసం నిత్యం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
ముఖ్యంగా సినిమా అనేది ఒక ఫ్యాషన్.. ఓ కల, ఓ జీవిత లక్ష్యం. అందుకోసం ఎంతోమంది జాబ్స్ ప్రిపేర్ అవ్వకుండా, ఉన్న జాబ్స్ వదిలేసి కూడా సినిమా రంగంలోకి వస్తుంటారు. ఇంకొందరైతే తమ 50 ఏళ్ల వయసులో కూడా సినిమా ఛాన్స్ కోసం ఆరాటపడుతునే ఉంటారు. అలాంటి సినిమా పట్ల అమితమైన ప్రేమ ఉన్న ఓ వ్యక్తికి అనుకోకుండా నటుడిగా అవకాశం దక్కింది. తన కల నిజమైన క్షణంలో ఆయన వ్యక్తం చేసిన భావోద్వేగాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆయన ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం.
సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్‌లో, వందమంది కొత్తవాళ్లను పరిచయం చేస్తూ అజర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొత్త సినిమా’. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మిస్తున్నారు. చరణ్ అర్జున్ లిరిక్స్ & మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో కిరాణా షాప్ నుంచి హీరోగా.. ‘కొత్త సినిమా’ సురేష్.. తన మట్టికథలాంటి ప్రయాణం ఎంతోమందిని కదిలిస్తుంది.
లేటెస్ట్గా జరిగిన ‘కొత్త సినిమా’ ప్రెస్‌మీట్‌లో తన ప్రయాణాన్ని పంచుకున్న నటుడు సురేష్ ఎమోషనల్ అయ్యారు. రామగుండం ప్రాంతానికి చెందిన తాను చిన్న కిరాణా షాప్ నడుపుకునేవాడినని, చిన్నప్పటి నుంచి సినిమాలు, నటనపై ఉన్న ఆసక్తితో ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. కష్టపడితే కలలు నిజమవుతాయని చెప్పిన ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
►ALSO READ | Avengers Doomsday: 5 నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్స్.. థియేటర్లలోకి రాకముందే 'అవెంజర్స్: డూమ్స్‌డే' రికార్డుల వేట!
సురేష్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం అన్నా.. నా పేరు సురేష్. రామగుండం నియోజకవర్గం గోదావరి ఖని మార్కండేయ కమాన్ దగ్గర ఉంటాను. హైదరాబాద్‌కి ఒక మూడు, నాలుగు సార్లు వచ్చి ఉంటా. సినిమా డబ్బింగ్ అప్పుడు వచ్చినా మళ్లీ.. ఈవెంట్ ఉందని నిన్న వచ్చా. నాది ఒక చిన్న కిరాణం షాపు అన్నా.. కిరాణా షాపు అంటే మీ అందరికి తెలుసు కదా అన్నా.. కందిపప్పు, చక్కెర, బెల్లం, కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు ఇవి అమ్ముతా అన్నా. అయితే నాకు ఎలా ఉండే అంటే.. ఒకతను చక్కెర కొనుక్కోపోయిండు. నాలుగు రోజుల తర్వాత వచ్చి చీమలు పట్టాయి, ఏం చక్కెర ఇచ్చావయ్యా అంటే.. ఆయన డబ్బులు ఆయనకు వాపసు ఇచ్చేశా.. "అలా ఉండేటోన్నీ అన్నా. అందరితో మంచిగా. ఈ నేపథ్యంలోనే హే సురేష్ మంచోడు.. దిల్‌దారు.. హే సూపరయ్యా అంటే.. అందరి నమస్కే పెట్టుకుంటూ పలకరించుకుంటూ పోయేటోన్నీ. యాక్టింగ్ అన్నా, సినిమా అన్నా.. నాకు పిచ్చి. నాలాగే.. కొన్ని లక్షల మందికి యాక్టింగ్, సినిమా అంటే అందరికి ఇష్టముంటదిగా" అని సురేష్ అన్నారు.
‘‘నేను ఏదో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, కిరాణం షాపు నడుపుకునేటోన్నీ.. సినిమా అంటే పిచ్చి ఉంటే ఏం చేస్తావ్ అన్నా.. ఏం చేయలేవు. హైదరాబాదుకు పోవాలి. పెద్ద పెద్దోళ్లను కలవాలి. ఎంతో కష్టపడితే కానీ అవకాశాలు రావు’’ అని సురేష్ తన మనసులో మాటల్ని వినమ్రంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొత్త నటుడు సురేష్.. చాలా హుందాగా, మట్టి మనిషిగా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
