ఉప్పల్ భగాయత్ సమీపంలో కృష్ణా ఫేజ్-2 పైప్‌లైన్ ను కారు ఢీకొట్టడంతో భారీ లీకేజీ అయ్యింది. 2026 అక్టోబర్ 20న తెల్లవారు జామున నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 వద్ద ఈ ఘటన జరిగింది. పైప్‌లైన్ ఎయిర్ వాల్వ్‌ల వ్యవస్థను కారు ఢీకొట్టింది. ప్రమాదవశాత్తు ఎయిర్ వాల్వ్‌లు దెబ్బతినడంతో భారీగా నీటి లీకేజీ జరిగింది. దీంతో పలు ప్రాంతాలకు నీటి అంతరాయం ఏర్పడనుంది.
ఈ ఏరియాలకు నీటి సరఫరా అంతరాయం:
కృష్ణా ఫేజ్-2 పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
- బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, బీరప్పగడ్డ, రామంతాపూర్, ఉప్పల్, ప్రకాశ్‌నగర్.
- మేకలమండి, పద్మారావునగర్, బేగంపేట, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్ ప్రాంతాల్లోనూ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం
- సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, నల్లగుట్ట, మెట్టుగూడ ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం
- వైశాలినగర్, మీర్‌పేట, బడంగ్‌పేట, ఏఆర్‌సీఐ ప్రాంతాలపైనా ప్రభావం
- బాలాపూర్, మైసారం, మారేడపల్లి ప్రాంతాల్లోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం
మరమ్మతుల పనులు పూర్తయ్యాక యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరణ జరుగుతుందని అధికారులు తెలిపారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రభావిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
పనులను వేగంగా పూర్తి చేయాలని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, ట్రాన్స్మిషన్ అధికారులకు సూచించారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని వినియోగదారులకు జలమండలి విజ్ఞప్తి చేసింది.
