అక్టోబర్ 26న కృష్ణా బోర్డు మీటింగ్..కీలక వివాదాస్పద అంశాలపై చర్చ

అక్టోబర్ 26న కృష్ణా బోర్డు మీటింగ్..కీలక వివాదాస్పద అంశాలపై చర్చ
  • జలసౌధలో ఉదయం 11 గంటలకు కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ 21వ సర్వసభ్య సమావేశం
  • తెలంగాణ, ఏపీ ఈఎన్సీలకు సమాచారం

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం, నీళ్ల పంపిణీపై ఈ నెల 26న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ) 21వ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఈ మీటింగ్ కు.. కేఆర్ఎంబీ తాజాగా డేట్ ఫిక్స్ చేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. ఈ నెల 26న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఎర్రమంజిల్ జలసౌధ వేదికగా ఉదయం 11 గంటలకు ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. గతంలో వాయిదా పడిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పలు కీలక వివాదాస్పద అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. 

వాస్తవానికి కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ 21వ సర్వసభ్య సమావేశాన్ని అక్టోబర్ 1వ తేదీనే నిర్వహించాలని బోర్డు తొలుత నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాల నుంచి ఎజెండా అంశాలను కూడా స్వీకరించారు. అయితే అదే రోజున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉండటంతో హాజరు కాలేమని, భేటీని రీషెడ్యూల్ చేయాలని తెలంగాణ ఈఎన్సీ బోర్డుకు లేఖ రాశారు. దీంతో ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. గత కొద్దికాలంగా త్రిసభ్య కమిటీ సమావేశాల్లో తేలని పలు కీలక అంశాలు ఈ 21వ సర్వసభ్య భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. 

ఆగస్టు 24న, సెప్టెంబర్ 4న జరిగిన త్రీ మెంబెర్ కమిటీ సమావేశాలు ఏం తేలకుండానే ముగిశాయి. ఇప్పటివరకు కొనసాగుతున్న 66:34 తాత్కాలిక నిష్పత్తిని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కనీసం 50:50 నిష్పత్తిలో నీటిని పంచాలని పట్టుబడుతోంది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడాన్ని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, అటు రాయలసీమ అవసరాల పేరుతో ఏపీ.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అదనంగా నీటిని తోడేస్తోందని తెలంగాణ వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే బోర్డు మీటింగ్ ను ఏర్పాటు చేశారు.