బొగ్గు స్కామ్పై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

బొగ్గు స్కామ్పై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా?.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
  • రూ.3,800 బొగ్గు.. రూ.12 వేలకు ఎందుకు కొంటున్నారని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఓ ఈఎంఐ ముఖ్యమంత్రి అని, కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్రతి నెలా రాజకీయ ఈఎంఐలు చెల్లించకపోతే కుర్చీ ఎక్కడ ఊడిపోతుందోనన్న భయంతో రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, సింగరేణి కుంభకోణాలు, విదేశీ బొగ్గు టెండర్లపై దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.

శుక్రవారం తెలంగాణ భవన్‌‌‌‌లో నర్సంపేట నియోజకవర్గ సమన్వయ సమావేశంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక భేటీలో కేటీఆర్ మాట్లాడారు. ‘సింగరేణిలో టన్ను బొగ్గు రూ.3,800కే లభిస్తుంటే.. ఆస్ట్రేలియా నుంచి రూ.10 వేల నుంచి రూ.12 వేలు పోసి ఎందుకు కొంటున్నరు? ఒకప్పుడు 70 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి 24 గంటల కరెంట్‌‌‌‌కు వెన్నెముకగా నిలిచిన సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బద్నాం చేస్తోంది.

సంస్థకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.60 వేల కోట్ల బకాయిలను తొక్కిపెట్టి, బొగ్గు కొరతను కృత్రిమంగా సృష్టించారు. సీఎం బామ్మర్ది ప్రమేయంతో జరిగిన రూ.10 వేల కోట్లు, సోలార్ పవర్ స్కామ్‌‌‌‌లపైనా సమగ్ర విచారణ జరిపించాలి’ అని డిమాండ్​ చేశారు.  

ఏపీలో జల పండుగ.. తెలంగాణలో కరువు

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే కారణమని కేటీఆర్ ఆరోపించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరిలో 1,000 టీఎంసీల వరద నీటిని సముద్రంలోకి వృథాగా వదిలేసి, ఇప్పుడు ఎల్-నినో సాకుతో చేతులెత్తేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్‌‌‌‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని ఆరు నెలల ముందే చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.