- ఈసారి దేశ రాజకీయాల్లో ఆయనే కీలక నేత
- కాంగ్రెస్, బీజేపీయేతర శక్తులు ఏకం కావాలె
- సీఎం రేవంత్ హడావుడి ఇంకో ఏడాది మాత్రమే
- మేడిగడ్డ దానంతట అది కూలిపోలేదు.. కాంగ్రెస్ వాళ్లు కావాలని కుట్ర చేసి కూల్చేశారు
- ఎల్‌నినో అలర్ట్ ఉన్నా ప్రాజెక్టులు ఎండబెట్టిన్రు
- అంబర్‌పేట మీటింగ్‌లో మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్‌కు ఓటేసి మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దామని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా హడావుడి చేసేది మరో ఏడాది మాత్రమేనని, ప్రజలు కాంగ్రెస్ సర్కారును సాగనంపడం ఖాయమని జోస్యం చెప్పారు. అబద్ధపు ప్రచారాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. తెలంగాణలో పాలన ‘పిచ్చోడి చేతిలో రాయిలా’ ఉందని, రాష్ట్రాన్ని విచ్చలవిడిగా లూటీ చేస్తున్నారని ఆరోపించారు.
శుక్రవారం తెలంగాణ భవన్‌లో అంబర్‌పేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని అన్నారు. అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే ఆ పార్టీ అసలు రంగు బయటపడిందన్నారు. రాష్ట్రంలో కరెంట్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పల్లెలు, పట్టణాల్లో తాగునీటి కష్టాలు పెరిగాయని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంపై వాతావరణ శాఖ 10 నెలల ముందే హెచ్చరించినా ప్రభుత్వం మేల్కొనలేదని ఆరోపించారు. పక్క, దిగువ రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్తలతో ప్రాజెక్టులను నింపుకుంటే రేవంత్ రెడ్డి మాత్రం వాటిని ఎండబెట్టారని విమర్శించారు.
కేసీఆర్‌కు పేరొస్తుందనే మేడిగడ్డపై కుట్ర
కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని, తన తప్పుడు ప్రచారాలు బయటపడతాయని రేవంత్ రెడ్డి కుట్రలు పన్నారని కేటీఆర్ ఆరోపించారు. మేడిగడ్డ దానంతటదే కూలిపోలేదని, కాంగ్రెస్ నేతలే కావాలని కూల్చి, ఆ తర్వాత రాహుల్ గాంధీని అక్కడికి తీసుకొచ్చి అబద్ధాలు చెప్పించారని అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని, కేసీఆర్‌పై విమర్శల విషయంలో ఆ రెండు పార్టీలు ఒక్కటవుతున్నాయని ఆరోపించారు. రాహుల్ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టినా లేవడం లేదని ఎద్దేవా చేశారు. దేశాన్ని బీజేపీ సంక్షోభంలోకి నెడుతున్నా, దాన్ని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ ఎజెండా కాంగ్రెస్‌కు లేదన్నారు. ఆ పార్టీ చేతగానితనం వల్లే దేశవ్యాప్తంగా యువత స్వయంగా రంగంలోకి దిగి పోరాడుతోందని పేర్కొన్నారు.
కార్పొరేషన్, ‘స్థానిక’ ఎన్నికలు పెట్టే దమ్ముందా
గత పదేళ్లలో ఎన్నడూ లేనంత బలహీనంగా బీజేపీ తయారైందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర శక్తులు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని, నాలుగేళ్ల కిందటే కేసీఆర్ ప్రత్యామ్నాయ కూటమి గురించి చెబితే చాలామందికి అర్థం కాలేదని గుర్తుచేశారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర మళ్లీ కీలకం కాబోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం రేవంత్ సర్కారుకు లేదని కేటీఆర్ సవాల్ విసిరారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా 2016 ఫలితాలు పునరావృతమవుతాయని, బీఆర్‌ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
