- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: చారిత్రక వరంగల్ నగర రూపురేఖలను మార్చేలా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) ప్రతిపాదించిన పలు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధుల కేటాయింపుతో పాటు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ కింద హనుమకొండ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ) పునరుద్ధరణ, వరంగల్ ఖిల్లా అభివృద్ధి పనుల కోసం రూ.382 కోట్ల అంచనా వ్యయంతో కూడిన 5 ప్రాజెక్టులకు అనుమతిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి డాక్టర్ టి.కె. శ్రీదేవి గురువారం జీవో నెంబర్ 957 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రపంచ బ్యాంకు ఆమోదించిన ‘తెలంగాణ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ జాబ్స్ ప్రోగ్రామ్’ లో భాగంగా ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులు హనుమకొండ, వరంగల్ ప్రాంతాలను సురక్షితమైన, పర్యాటక పరంగా శక్తివంతమైన నగర కేంద్రాలుగా మారుస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
వరంగల్ ఖిల్లా చారిత్రక రాతి కోట గోడల పక్కన ఉన్న లోపలి, వెలుపలి సముదాయాల పునరుద్ధరణ కోసం ఇప్పటికే పురాతత్వ సర్వే సంస్థ (ఏఎస్ఐ)తో కూడా ప్రభుత్వం అవగాహన ఒప్పందం
కుదుర్చుకుంది.
5 ప్రధాన ప్రాజెక్టుల వివరాలు..
వరంగల్ ఖిల్లా అభివృద్ధిలో భాగంగా స్పాంజ్ సిటీస్ విధానంలో పనులు చేపట్టడానికి రూ. 209 కోట్లు కేటాయించారు. హనుమకొండ సెంట్రల్ ప్లాజా పునర్నిర్మాణం కోసం రూ. 19 కోట్లు, ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ కమ్ కమర్షియల్ కాంప్లెక్స్ కోసం రూ. 125 కోట్లు, వేయి స్తంభాల గుడి పరిసరాల అభివృద్ధి పనుల కోసం రూ. 20 కోట్లు, మ్యూజికల్ గార్డెన్ ఏర్పాటు కోసం రూ. 9 కోట్లు కేటాయించారు.
కాగా, బస్ టెర్మినల్ నిర్మాణం కోసం అదనంగా రూ. 50 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మెగా ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ప్రపంచ బ్యాంకు, ఇతర నిధుల ద్వారా సమకూర్చుకుంటూ, పనులను త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కుడా వైస్ -చైర్మన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
