- స్పీకర్ గడ్డం ప్రసాద్
- కుమ్రంభీమ్ పోరాట యోధుడు: మండలి చైర్మన్ గుత్తా
- అసెంబ్లీలో కుమ్రంభీమ్, పండుగ సాయన్న జయంతి
హైదరాబాద్, వెలుగు: అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన కుమ్రంభీమ్, పండుగ సాయన్న భావితరాలకు ఆదర్శమని, మహనీయుల ఆశయాలను కొనసాగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం అసెంబ్లీలో పండుగ సాయన్న 174వ జయంతి, ఆదివాసీ పోరాటయోధుడు కొమురంభీం 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి, మండలి సెక్రటరీ నరసింహాచారి పాల్గొని, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా మాట్లాడుతూ, తెలంగాణ నేల పోరాటాలకు, త్యాగాలకు, ఆత్మగౌరవానికి నిలయమన్నారు. సామాజిక అసమానతలు, దోపిడీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. "జల్, జంగల్, జమీన్" అనే నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కుమ్రంభీమ్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. పండుగ సాయన్న అణగారిన వర్గాల పక్షాన నిలిచిన గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నారు. కుమ్రంభీమ్, పండుగ సాయన్న వంటి మహనీయుల పోరాటాల వెనుక సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వం వంటి గొప్ప ఆశయాలు ఉన్నాయని తెలిపారు.
కుమ్రంభీమ్ ఆదివాసీల ఆరాధ్య దైవం..
కుమ్రంభీమ్ ఆదివాసీల ఆరాధ్య దైవమని, గోండు బెబ్బులిగా ప్రసిద్ధి చెందిన గొప్ప పోరాట యోధుడని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. అడవి తల్లి ఒడిలో పుట్టిన ఆత్మగౌరవానికి కుమ్రంభీమ్ ప్రతీక అన్నారు. నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి, రైతులు, ఆదివాసీల హక్కుల కోసం చిన్న వయసులోనే పోరాటం ప్రారంభించిన ధీరుడని తెలిపారు. పండుగ సాయన్న నిజాం నిరంకుశ పాలన, దొరల దోపిడీ, సామాజిక అన్యాయాలను ఎదురించిన తెలంగాణ వీరుడని కొనియాడారు. మహనీయులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు.
