కుంటాలకు తప్పని నిరాశ... పర్వతమాల పరియోజన స్కీమ్లో దక్కని చోటు

కుంటాలకు తప్పని నిరాశ... పర్వతమాల పరియోజన స్కీమ్లో దక్కని చోటు
  • రాష్ట్రంలో ఐదు రోప్​ వేలను సాంక్షన్​ చేసిన కేంద్రం
  • అందులో కుంటాల వాటర్​ ఫాల్​కు దక్కని చాన్స్​ 
  • గతంలోనే రూ.7.33 కోట్లతో రోప్​ వే ప్రపోజల్స్​
  • పెండింగ్​లోనే ట్రైబల్​ టూరిజం సర్క్యూట్​ 

మంచిర్యాల, వెలుగు: తెలంగాణ నయాగరా, రాష్ర్టంలోనే ఎత్తైన కుంటాల వాటర్ ఫాల్స్​పై డెవలప్​మెంట్​పై సెంట్రల్​గవర్నమెంట్ ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల పర్వతమాల పరియోజన స్కీమ్​కింద రాష్ట్రంలో రూ.1,230 కోట్లతో ఐదు కొత్త రోప్‌‌వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

ఇందులో యాదగిరిగుట్ట టెంపుల్, నాగార్జున కొండ, పెద్దపల్లి జిల్లాలోని రామగిరి ఖిలా, నల్గొండ జిల్లాలోని హనుమాన్ హిల్స్, నిజామాబాద్ జిల్లా డిచ్‌‌పల్లిలోని ఖిలా రామాలయం ఉన్నాయి. అయితే, పర్యాటకులను విశేషంగా ఆకర్షించే కుంటాల జలపాతానికి చోటు కల్పించకపోవడంపై ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా వాసులు, పర్యాటకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లా టూరిజం డెవలప్​మెంట్​ కోసం ప్రపోజల్స్​ పంపినప్పటికీ ఏ ఒక్క పర్యాటక ప్రాంతానికీ తాజా జాబితాలో చోటు దక్కలేదు. 

కలగానే ట్రైబల్ టూరిజం సర్క్యూట్... 

2017లో ఉమ్మడి ఆదిలాబద్​ జిల్లాలోని జలపాతాలు, చారిత్రక కోటలను కలుపుతూ సుమరు రూ.104 కోట్ల అంచనా వ్యయంతో ట్రైబల్​ టూరిజం సర్య్కూట్​ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా కుంటాలలో రూ.16.41 కోట్లతో ఒక ట్రైబల్ రిసార్ట్, జలపాతం వద్ద రూ.7.33 కోట్లతో రోప్ వే నిర్మాణంతోపాటు ఇతర పర్యాటక సౌకర్యాలను కల్పించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే పర్యాటకుల సంఖ్య పెరగడంతోపటు స్థానికంగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతయని జిల్ల ప్రజలు ఆశించారు. 

అయితే, ఏండ్లు గడుస్తున్నా ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడంతో రోప్​వే కలగనే మిగిలిపోయింది. అయితే, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని చారిత్రక కంకలమ్మ ఆలయం, పెంచికల్‌‌పేట మండలం నందిగాం గ్రామంలో ఉన్న పాలరాపు కొండ వద్ద కూడా రోప్‌‌ వేలను ప్రతిపాదించారు. సిర్పూర్​ ఎమ్మెల్యే డాక్టర్ హరీశ్​బాబు ఇటీవలే సెంట్రల్ మినిస్టర్​ నితిన్ గడ్కరీని కలిసి ఈ ప్రాజెక్టులను మంజూరు చేయాలని కోరినప్పటికీ నిరాశే మిగిలింది. 

400కు పైగా మెట్లు.. పర్యాటకులకు తప్పని తిప్పలు

వర్షాకాలంలో కుంటాల వాటర్​ఫాల్స్​చూడడానికి తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా టూరిస్టులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. అయితే, వాటర్​ఫాల్స్​ దిగువన (బేస్)కు చేరుకోవాలంటే సుమారు 400కు పైగా మెట్లు దిగాల్సి ఉంటుంది. తిరిగి పైకి రావడం పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులకు తీవ్ర అసౌకర్యంగా మారుతోంది. 

టూరిస్టుల సౌకర్యార్థం ఇక్కడ రోప్‌‌వే, జిప్‌‌లైన్‌‌ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌‌ ఎప్పటి నుంచో ఉంది. అయినప్పటికీ, ప్రస్తుతం జలపాతాన్ని సందర్శించాలంటే మెట్ల మార్గమే ఏకైక ఆధారం.