అన్నదాతల కన్నీటి వ్యథతో రాయలసీమలోని కర్నూలు జిల్లా అతలాకుతలం అవుతోంది. ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలు చేతులెత్తేయడంతో.. వర్షాధారిత వ్యవసాయంపై ఆధారపడిన లక్షలాది రైతు కుటుంబాల బతుకులు రోడ్డున పడ్డాయి. ఆశగా వేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోవడం, లక్షల్లో అప్పులపాలవడంతో ఇప్పటికే సుమారు 10వేల రైతు కుటుంబాలు తమ సొంత గ్రామాలను వదిలి వలసబాట పట్టాయి. దసరా పండగ తర్వాత ఈ సంఖ్య ఏకంగా 50వేల కుటుంబాలకు చేరుకునే అవకాశం ఉందనే రిపోర్ట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి.
సాగుపై పెట్టుబడి బూడిదపాలు..
కర్నూలు జిల్లాలో సుమారు 80 శాతానికి పైగా వ్యవసాయ భూమి పూర్తిగా రుతుపవనాల వర్షాల మీదే ఆధారపడి ఉంది. జూన్ నెలలో కురిసిన తొలకరి జల్లులను నమ్మి రైతులు పత్తి, కంది, ఆముదం వంటి వర్షాధార పంటలను సాగు చేశారు. ఎకరాకు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు భూమి చదును చేసి, విత్తనాలు, ఎరువుల కోసం ఖర్చు పెట్టారు. అయితే జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు పూర్తిగా కురవకపోవడంతో పంటలన్నీ ఎండిపోయాయి. ఎకరాకు సరాసరి రూ. 50వేల వరకు నష్టం వాటిల్లింది.
పంటలను దక్కించుకునేందుకు రైతులు 800 నుంచి 1,000 అడుగుల లోతుకు బోరుబావులు వేయించినా తగినంత భూగర్భ జలం లభించలేదు. దీంతో పెరిగిన విద్యుత్ ఖర్చులు, చేసిన అప్పులు రైతులను మరింత తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. ముఖ్యంగా ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ వంటి పశ్చిమ ప్రాంత డివిజన్లలో కరువు విలయతాండవం చేస్తోంది.
జిల్లాలోని 12 తీవ్ర ప్రభావిత మండలాల నుంచి చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున వలస వెళ్తున్నారు. ప్రధానంగా ఆదోని, పత్తికొండ, ఆస్పరి, నందవరం, కోసిగి, చిప్పగిరి, కౌతాలం, ఎమ్మిగనూరు, సి.బెళగల్, కోడుమూరు, మంత్రాలయం, ఆలూరు మండలాల్లో పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. ఈ ప్రాంతాల ప్రజలు ఉపాధి కరువై బతుకుదెరువు కోసం ఈ ప్రాంతాల ప్రజలు అద్దె ఆటోలు, ఆర్టీసి బస్సులు, రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు పయనమయ్యారు. వీరు ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు, చెన్నై, బళ్లారి, ఢిల్లీ వలస వెళుతున్నారట. ఈ సిటీల్లో కన్స్ట్రక్షన్ కూలీలుగా, ఇండస్ట్రియల్ యూనిట్లలో పనులకు, దూర ప్రాంతాల్లోని పొలాల్లో రోజు కూలీలుగా పనిచేసేందుకు పయనం అయ్యారు.
జిల్లాలోని 27 మండలాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం కేవలం 15 మండలాలను మాత్రమే తొలివిడత ఖరీఫ్ కరువు జాబితాలో చేర్చింది. జూలైలో 56 శాతం, ఆగస్టులో 57 శాతం మేర వర్షాధార లోటు నమోదైందని కలెక్టర్ ఎ. సిరి తెలిపారు. అయితే వృక్షసంపద, భూగర్భ జలాలు, నేల తేమ వంటి అంశాలపై అధికారిక అంచనా ప్రమాణాల కారణంగానే ఈ తేడాలు వచ్చాయని వివరించారు.
రైతులు, వ్యవసాయ సంఘాలు మాత్రం 27 మండలాల్లోనూ తీవ్ర కరువు నెలకొందని వాపోతున్నాయి. ప్రభుత్వం కరువు జాబితా నుంచి మినహాయించిన ప్రాంతాల్లోని రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు, పంట బీమా క్లెయిమ్లు, రుణాల పునర్వ్యవస్థీకరణ, వడ్డీ రాయితీలు, సబ్సిడీ పశుగ్రాసం వంటి ముఖ్యమైన ప్రయోజనాలు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉపాధి హామీ పథకం అమలు మందకొడిగా ఉందని, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా రూ.260.38 దినసరి వేతనం సరిపోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం జాబితాలో ఉన్న 4.64 లక్షల జాబ్ కార్డు దారుల్లో కేవలం 3.24 లక్షల మంది మాత్రమే యాక్టివ్గా ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని డ్వామా పీడీ ఐ. నరసింహారెడ్డి స్పష్టం చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో కరువు తీవ్రత కారణంగా ఊళ్లకు ఊళ్లే ఖాళీ అవుతుండటం రాయలసీమ రైతాంగం ఎదుర్కొంటున్న దుస్థితిని కళ్లకు కడుతోంది.
