దోహాలోని ఎడ్యుకేషన్ సిటీ.. చుట్టూ అందమైన యూనివర్సిటీలు, పెద్ద భవనాలతో అందంగా కనిపిస్తోంది. అక్కడే ఒక అందమైన నీలిరంగు టైల్స్‌తో ఉన్న భవనం చూపరులను ఆకట్టుకుంటోంది. అదే లావ్ వా కలం – ఎమ్‌ఎఫ్ హుస్సేన్ మ్యూజియం. ఈ భవనాన్ని డిజైన్ చేసింది ఆయనే. అందుకే అణువణువూ ఆర్టిస్టిక్‌గా ఆశ్చర్యపరుస్తుంది.
ఆర్కిటెక్ట్ మార్తండ్ ఖోస్లా దీన్ని నిర్మించారు. మ్యూజియం లోపలికి వెళ్లగానే హుస్సేన్ జీవితం కళ్ల ముందు సినిమా లాగా కదలాడుతుందంటే అతిశయోక్తి కాదు. ఒక్కో గదిలో ఒక్కో ప్రత్యేకమైన చిత్రం మనసును కట్టిపడేస్తుంది.
మొదటి గదిలో అతని చిన్నప్పటి ఫొటోలు, బిల్‌బోర్డ్‌లు పెయింట్ చేసిన గుర్తులు, ముంబైలో ప్రోగ్రెసివ్ ఆర్టిస్టులతో కలిసి ఉన్న పెద్ద ఫోటో.. నెహ్రూ, సీవీ రామన్, ఇక్బాల్ లాంటి పెద్దల చిత్రాలు ఎంతగానో ఆకర్షిస్తాయి. పైన ఒక గదిలో అతని సినిమాలు పెద్ద స్క్రీన్‌లపై ప్రదర్శన జరుగుతుంటాయి. అతని పాత సినిమా త్రూ ది ఐస్ ఆఫ్ ఏ పెయింటర్ కూడా ప్రదర్శితమవుతోంది. కింది గదుల్లో అతని చివరి రోజుల్లో వేసిన చిత్రాలు ఉన్నాయి.
కతార్‌లో ఉండగా వేసిన చిత్రాలు, యెమెన్, అరబ్ చరిత్ర గురించి.. గుర్రాలు, ఒంటెలు బొమ్మలతో కూడిన అరబిక్ అక్షరాలు – అన్నీ కలిసి అద్భుతంగా కనువిందు చేస్తాయి. వాటిలో ఒక చిత్రం గుర్తుండిపోతుంది. అదే ఎడారిలో లాస్ట్ సప్పర్. లియోనార్డో డావిన్సీ పెయింటింగ్ లాస్ట్ సప్పర్‌ను నమూనాగా తీసుకుని అలాంటి ఒక పెయింటింగ్ వేశాడు.
అందులో లాస్ట్ సప్పర్ పెయింటింగ్‌లో లాగానే క్రీస్తును పోలిన వ్యక్తి కనిపిస్తాడు. ఆయనతోపాటు ఒక ఒంటె బయట నుంచి లోపలికి చూస్తున్నట్టు, చిన్న దేవదూతలు టేబు ల్ కింద ఆడుతున్నట్టు.. కనిపిస్తుంది. అది చూడగానే ఎవరికైనా ముందు నవ్వొస్తుంది. తర్వాత అది మనసును ఆలోచనలో పడేస్తుంది. చివరి భవనంలో సీరూ ఫి అల్ అర్ధ్ అనే పెద్ద ఇన్‌స్టాలేషన్ ఉంది.
పెద్ద గుర్రాలు, పాత కార్లు, భూమి, సముద్రం, ఆకాశం కనిపిస్తాయి. ఆ చిత్రాలను చూస్తూ అనుభూతి చెందిన వాళ్లెవరికైనా బయటకు వచ్చేటప్పుడు హుస్సేన్ ఎంత గొప్పవారో అర్థమవుతుంది.
హుస్సేన్ వ్యక్తిత్వం కాస్త భిన్నంగా ఉంటుంది.
తెల్లజుట్టు, గడ్డం, చెప్పుల్లేకుండా తిరిగేవాడు. కానీ ఖరీదైన కార్లు ఇష్టపడేవాడు. చిన్న పిల్లవాడిలా ఆటలాడేవాడు. అన్ని మతాలను గౌరవించేవాడు. అయితే, ఈ మ్యూజియం చూసిన తర్వాత హుస్సేన్ ఆర్టిస్టిక్ టాలెంట్ అంత ఈజీగా అర్థం చేసుకోలేము అనిపిస్తుంది.
అది భారతదేశం నుంచి అరబ్ దేశాల వరకు వ్యాపించిన ఒక పెద్ద ప్రయాణం. మ్యూజియంలో నుంచి అడుగు బయటపెడుతుంటే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే.. నిజమైన కళ ఎక్కడా ఆగదు. అందర్నీ ఏకం చేస్తుంది అని.
