‘లాల్ సింగ్ చద్దా’ తెలుగు ట్రైలర్ విడుదల

‘లాల్ సింగ్ చద్దా’ తెలుగు ట్రైలర్ విడుదల

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' తెలుగు ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్ లో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ట్రైలర్ విడుదల చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ... భారతీయ సినిమాకు అమీర్ ఖాన్ ఒక ఖజానా అని అభివర్ణించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో గొప్ప నటుడు అనిపించుకున్నాడని, అతని నడక, నడవడిక అంటే తనకు చాలా ఇష్టమన్నారు. అమీర్ లాగా తాము చేయాలని అనుకుంటున్నట్లు.. కానీ తమకున్న లిమిట్స్ వల్ల చేయలేకపోతున్నామన్నారు.

ఏ నటుడైనా అమీర్ ఖాన్ నటనకు ఫిదా అవ్వాల్సిందేనని, ప్రేమ, బాధ్యతతో లాల్ సింగ్ చద్దాకు సమర్పకుడిగా ఉన్నట్లు వెల్లడించారు. గతంలో తెలుగు సినిమాలని పట్టించుకునే వాళ్ళు కాదని.. బాహుబలి, కేజీఎఫ్, RRR తర్వాత మొత్తం మారిపోయిందన్నారు. అప్పట్లో నార్త్, సౌత్ అనే భేదం ఉండేదని.. ఇప్పుడు ఇండియన్ మూవీస్ అంటున్నట్లు తెలిపారు. తెలుగు సినిమాలో నటించేందుకు అవకాశం కల్పించాలని చిరంజీవిని కోరుతున్నట్లు అమీర్ ఖాన్ కోరారు. తాను ఒక నార్త్ యాక్టర్ అని, హెల్ప్, బ్లెస్సింగ్స్ కోసం హైదరాబాద్ కి వచ్చినట్లు అమీర్ తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవికి అమీర్ పానీపూరి తినిపించారు. ట్రైలర్ విడుదలలో పాల్గొన్న మరో నటుడు నాగ చైతన్య.. అమీర్ ఖాన్ తో తెలుగు డైలాగు చెప్పించాడు. చిరంజీవి సమర్పణలో ఆగస్టు 11న లాల్ సింగ్ చద్దా విడుదల కానుంది. 

డైరెక్టర్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అమీర్ సరసన కరీనా కపూర్ నటించారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. అమీర్ - నాగ చైతన్యలు స్నేహితులుగా నటిస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన ట్రైలర్ లో సరిగ్గా నడవలేని, మాట్లాడలేని ఓ సిక్కు కుర్రాడు మానసికంగా ఎలా బలంగా మారి పరుగులు తీశాడనే కథాంశంతో రూపొందించారని తెలుస్తోంది. తల్లి కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని కూడా ఎలివేట్ చేశారు. సిక్కు కుర్రాడి జీవితంలోని వివిధ దశలను సినిమాలో చూపించారు. ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.