LENIN Review: థియేటర్లలోకి వచ్చిన ‘లెనిన్’.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

LENIN Review: థియేటర్లలోకి వచ్చిన ‘లెనిన్’.. పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ (LENIN). మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ మూవీని టాలీవుడ్ టాప్ బ్యానర్స్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రెస్టీజియస్గా నిర్మించాయి. భారీ రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ శుక్రవారం (జులై 10, 2026న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎలాంటి ప్రీమియర్స్ లేకుండానే, నేరుగా విడుదల రోజే సాధారణ టికెట్ ధరలతో మూవీ థియేటర్లోకి వచ్చింది.

తెలుగురాష్ట్రాల్లో పలు థియేటర్లో ఉదయం 5 గంటల నుంచే షోస్ మొదలయ్యాయి. టీజర్, ట్రైలర్ విజువల్స్తో ఆకట్టుకున్న లెనిన్ ఎలా ఉంది? సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు? వరుస ఫెయిల్యూర్స్తో సతమవుతున్న అఖిల్, భాగ్యశ్రీ హిట్ కొట్టారా? లేదా? అనేది X (ట్విట్టర్) రివ్యూలో తెలుసుకుందాం. 

ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?

తొలి షోలు పూర్తికాగానే సోషల్ మీడియా వేదికగా X (ట్విటర్) ఆడియన్స్ తమ రివ్యూలు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ హాఫ్, అఖిల్ నటన, ఇంటర్వెల్ బ్లాక్‌, అలాగే జూనియర్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్‌ సినిమాని నిలబెట్టాయని ఆడియన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. గ్రామంలో అన్యాయానికి ఎదురుగా నిలిచి, ఓ పవర్ ఫుల్ గ్రామ పెద్దకు సవాల్ విసిరే ఓ యువకుడి పాత్రలో అఖిల్ పోషించిన లెనిన్ క్యారెక్టర్ గుర్తుండిపోతుందని అంటున్నారు. మరి ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్కు ముందు వచ్చే 30 నిమిషాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని.. ట్విస్టులు, ఫైట్ సీక్వెన్స్, ఎమోషనల్ క్లైమాక్స్ ప్రేక్షకులను పడేస్తుందని ఆడియన్స్ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. 

ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘అఖిల్‌కు 'లెనిన్' సాలిడ్ సినిమా అవుతుంది. ఫస్టాఫ్ లో ఒక 40 నిమిషాలు కథ కొంత నెమ్మదిగా సాగినా, ప్రీ-ఇంటర్వెల్‌కు ముందు వచ్చే అరగంట సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ట్విస్ట్‌లు, ఇంటర్వెల్ ఫైట్ హైలైట్‌గా నిలిచాయి. సెకండాఫ్ ఊహించని ట్విస్టులతో ఫుల్ సర్ప్రైజ్ చేసింది. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. తప్పకుండా థియేటర్‌లో చూడదగ్గ చిత్రం’’  అని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. 

మరో నెటిజన్ తన రివ్యూ ఇస్తూ..‘‘లెనిన్' మహాభారతాన్ని పోల్చే ఇంట్రెస్టింగ్ సెటప్‌తో మొదలైనప్పటికీ , ఆ తర్వాత రొటీన్ కమర్షియల్ కథనం వైపు వెళ్లిపోతుంది. ఇంపాక్ట్ ఇవ్వని లవ్ స్టోరీ, ఇప్పటికే ఎన్నోసార్లు చూసిన కమర్షియల్ సీన్స్ ఫస్ట్ హాఫ్‌ను కొంత ఫ్లాట్‌గా మార్చేస్తాయి. అయితే ప్రీ-ఇంటర్వెల్ నుంచి సినిమా పుంజుకుంటుంది. సెకండాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్టులు, కీలక సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. అయినప్పటికీ విలేజ్ బ్యాక్ డ్రాప్ గతంలో వచ్చిన సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగడం వల్ల కొన్ని చోట్ల పాతదనంగా అనిపిస్తుంది.

థమన్ అందించిన సంగీతం కొన్ని చోట్ల ఆకట్టుకోగా, మరికొన్ని చోట్ల అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. సాంగ్స్ ప్లేస్‌మెంట్ కూడా అంతగా సెట్ కాలేదనే అనిపించింది. ముఖ్యంగా అఖిల్ తన గత చిత్రాలతో పోలిస్తే నటనలో ఇంపాక్ట్ చూపించినప్పటికీ, సినిమా పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇవ్వలేకపోయింది. మొత్తంగా.. 'లెనిన్' ఒక యావరేజ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌’’ అని తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. 

ఓవరాల్గా..‘లెనిన్’లో అఖిల్ అక్కినేని తన నటనలో పూర్తిగా కొత్త కోణాన్ని చూపించాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అతని నటన సహజంగా, ఎలాంటి బలవంతపు ప్రయత్నం లేకుండా సాగిందని, కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఈ సినిమాకు అసలైన బలం భగ్యశ్రీ బోర్సే పోషించిన పాత్రేనని పలువురు పేర్కొంటున్నారు. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని, ఆ పాత్రే చిత్రానికి భావోద్వేగ బలాన్ని అందించిందని అంటున్నారు.

థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మొత్తం సినిమా అంతటా ఒకే స్థాయిలో ఆకట్టుకోకపోయినా, కొన్ని కీలక సన్నివేశాల్లో మాత్రం అద్భుతంగా పనిచేసి వాటి ప్రభావాన్ని మరింత పెంచిందని ప్రేక్షకులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ‘లెనిన్’ లో కథ కంటే పాత్రలే ఎక్కువగా గుర్తుండిపోతాయని, ముఖ్యంగా అఖిల్ నటన, భగ్యశ్రీ పాత్ర ఈ సినిమాను నిలబెట్టాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.