LENIN Review: ‘లెనిన్’ ఫుల్ రివ్యూ.. అఖిల్ ఖాతాలో సాలిడ్ హిట్ పడిందా? మూవీ ఎలా ఉందంటే..

LENIN Review: ‘లెనిన్’ ఫుల్ రివ్యూ.. అఖిల్ ఖాతాలో సాలిడ్ హిట్ పడిందా? మూవీ ఎలా ఉందంటే..

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ (LENIN). హీరో నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను మురళీకిశోర్ అబ్బూరు గ్రాండ్గా తెరకెక్కించారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా ఇవాళ శుక్రవారం (జూలై 10, 2026న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

చిత్తూరు జిల్లా రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై  ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి వరుస ఫెయిల్యూర్స్తో ఉన్న అఖిల్కు సినిమా ఎలాంటి బలాన్ని ఇచ్చింది? అఖిల్ కెరీర్‌‌లో ‘లెనిన్’ ల్యాండ్ మార్క్‌‌గా నిలిచిందా? లేదా? అనేది పూర్తి రివ్యూలో చూసేద్దాం. 

‘లెనిన్’ కథ..

చిత్తూరు జిల్లాలోని శ్రీ రామాపురం అనే గ్రామంలో భారతం మిట్ట అనే జాతర ఫేమస్. 18 రోజుల పాటు జరిగే ఆ  జాతర రక్తపు చుక్క నేలపై పడకుండా జరగాలన్నది ఊరి కట్టుబాటు. ఆ జాతర పనులు చూస్తుంటాడు లెనిన్ (అఖిల్). అనాథ అయిన తనను ఆ ఊరి పెద్ద జయంతమ్మ  (ఈశ్వరీ రావు) చేరదీస్తుంది. తన కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)తో  కలిపి పెంచుతుంది. చిన్నపటి నుండి వసంత్ లెనిన్ స్నేహితులు. డాక్టర్ చదువు ముగించుకుని జాతర సమయానికి ఊరు వస్తాడు వసంత్. ఇక ఆలయ ధర్మకర్త పొజిషన్ కోసం జయంతమ్మ మరిది యతిరాజులు (శివాజీ) ప్రయత్నిస్తుంటాడు. కానీ తన మామ అక్రమ సంతానం అని ఆమె వ్యతిరేకిస్తుంది.

లెనిన్ ను అతను కొడుకులా చూసుకుంటాడు. మరోవైపు కటౌట్ విషయంలో తనను ఎదిరించిన లెనిన్పై ఎమ్మెల్యే రాఘవ రెడ్డి (రమేష్ ఇందిర) రగిలిపోతుంటాడు. ఇదిలా ఉంటే జాతరలో చూసిన  భారతి (భాగ్యశ్రీ బొర్సే) ని ప్రేమిస్తాడు లెనిన్. ఆమె కూడా ప్రేమిస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో వసంత్తో ఆమె పెళ్లి నిశ్చయం అవుతుంది. వీళ్ల ప్రేమ విషయం తెలిసి ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటాడు వసంత్. అయితే దుండగులు తనను చంపే ప్రయత్నం చేస్తారు. లెనిన్ కాపాడతాడు. ఇక పెళ్ళి తర్వాత  పరిస్థితులు అన్నీ లెనిన్, భారతీలకు ప్రతికూలంగా మారతాయి. దానికి కారణం ఎవరు.. మెకవన్నే పులుల్లా దాడి చేసిన వాళ్లపై లెనిన్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది అసలు కథ.

ఎలా ఉందంటే?

మహాభారతంలోని కొన్ని పాత్రల స్వభావాలను ఆధునిక రాయలసీమ రాజకీయాలతో ముడిపెట్టి దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరు కథను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఫస్టాఫ్లో గ్రామ నేపథ్యం, పాత్రల పరిచయం, జాతర ఎపిసోడ్లు నెమ్మదిగా సాగినా, ఇంటర్వెల్‌కు ముందు నుంచి కథ వేగం అందుకుంటుంది. సెకండాఫ్లో భావోద్వేగాలు, యాక్షన్, రాజకీయ సంఘర్షణలు కథను ముందుకు నడిపిస్తాయి.

క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్లు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. కొన్ని చోట్ల నిడివి ఎక్కువగా అనిపించడం, మొదటి భాగంలో ఇంకాస్త వేగం ఉంటే బాగుండేదనే భావన కలిగించినా, మొత్తంగా దర్శకుడు చెప్పాలనుకున్న భావాన్ని ప్రభావవంతంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు.

‘లెనిన్’ పూర్తిగా కమర్షియల్ మసాలా సినిమా అని చెప్పలేం. రూరల్ పాలిటిక్స్, ఎమోషన్స్, యాక్షన్‌ను సమతుల్యం చేస్తూ దర్శకుడు రూపొందించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని చెప్పొచ్చు. అఖిల్ కెరీర్‌లో నటుడిగా కొత్త కోణాన్ని చూపించిన సినిమాగా నిలుస్తుంది. ఫస్టాఫ్ కొంత నెమ్మదిగా సాగినా, సెకండాఫ్, క్లైమాక్స్, తమన్ సంగీతం సినిమాను నిలబెడతాయి. ఓవరాల్ గా చెప్పాలంటే అఖిల్ అభిమానులు కాలర్ ఎత్తే సినిమాగా 'లెనిన్' నిలుస్తుంది. 

నటీనటులు..

అఖిల్ అక్కినేని ‘లెనిన్’ పాత్రలో పూర్తిగా లీనమై నటించాడు. ఇప్పటి వరకు చూసిన అఖిల్‌కు భిన్నంగా ‘లెనిన్’లో కనిపిస్తాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లోని భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ఆకట్టుకుంటాడు. భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌తో పాటు కథకు అవసరమైన ప్రాధాన్యతను తన పాత్ర ద్వారా అందించింది.

►ALSO READ | Prabhas: రిలీజ్‌కు ముందే ప్రభాస్ 'ఫౌజీ' రికార్డుల వేట.. నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ఆఫర్.. సగానికి పైగా బడ్జెట్ రికవరీ!

ప్రమోద్ పంజు హీరో స్నేహితుడి పాత్రలో మెప్పించగా, శివాజీకి బలమైన పాత్ర దక్కింది. మరోసారి తన అనుభవాన్ని చూపించే బలమైన పాత్రలో మెప్పించాడు. బ్రహ్మాజీ, శత్రు, ఈశ్వరీ రావు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీకల్ అంశాలు..

సాంకేతికంగా సినిమా చాలా బలంగా నిలుస్తుంది. తమన్ బీజీఎం అదిరిపోయింది. ముఖ్యంగా  క్లైమాక్స్, ఇంటర్వెల్‌లో ఆర్ఆర్ ఇచ్చిపడేశాడు. లియోన్‌ బ్రిట్టో సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలంగా నిలిచింది. రాయలసీమ గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ ఫస్ట్ 30 నిమిషాలు పరీక్షించిన తర్వాత కథలో వేగం పెంచేశాడు. అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్ సినిమాకు సహజత్వాన్ని తీసుకొచ్చింది.

చివరగా.. మహాభారతం నుంచి స్ఫూర్తి పొంది, ఓ రూరల్ ప్రపంచాన్ని డైరెక్టర్ మురళీ కిశోర్ రూపొందించడంలో సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే హర్ట్ టచింగ్ గా రాసుకున్న తీరు మెప్పించింది. ఇక మహాభారతం స్టోరీ చెప్తూ వచ్చే తారక్ వాయిస్ ఓవర్ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. సినిమాకు బెస్ట్ అవుట్‌పుట్ వచ్చేలా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ప్రొడక్షన్ వాల్యూస్‌ను అందించారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆ గ్రాండియర్ కనిపిస్తుంది.