చిన్న కథల్లో పెద్ద జీవిత పాఠాలు..మన వ్యతిరేక ఆలోచనలే మనకు శత్రువులు

చిన్న కథల్లో పెద్ద జీవిత పాఠాలు..మన వ్యతిరేక ఆలోచనలే మనకు శత్రువులు

తెలుగు సాహిత్య రంగంలో ఒకవైపు పెద్దల కోసం గంభీరమైన కథలు రాస్తూనే, మరోవైపు పిల్లల కోసం అంతే అద్భుతంగా కలం కదిలించే రచయితలు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఆర్.సి.కె. రాజు ఒకరు. ఆయన కలం నుంచి జాలువారిన 23వ పుస్తకమే ఈ ‘కటకటా మర్కటా’. కేవలం కథలే కాకుండా, పిల్లలను ఆకట్టుకునేలా బొమ్మలతో కూడిన 30 నీతి కథల సంపుటిగా ఈ పుస్తకం పాఠకుల ముందుకు వచ్చింది.

​బాలల పుస్తకాలకు బొమ్మలే ప్రాణం. ఈ పుస్తకంలోని రంగురంగుల బొమ్మలు కథలోని పాత్రలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ, పిల్లల్లో పుస్తకాన్ని చదవాలనే కుతూహలాన్ని రెట్టింపు చేస్తాయి. రచయిత శైలి చాలా సరళంగా, స్పష్టంగా ఉంది. నేటి తరం పిల్లల్లో నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవం, తోటివారికి సాయం చేయడం వంటి గుణాలను పెంపొందించేలా ఈ కథలను మలిచారు.

 రచయితకు బాలల మనస్తత్వంపై ఉన్న పట్టు ఈ ‘కటకటా మర్కటా’ పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తుంది. ​నేటి తరం పిల్లలకు నైతిక విలువలను పెంపొందించడానికి ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది. ‘చెట్టు ఆకులలో ఏ రెండు ఆకులు ఒకే రకంగా ఉండవు’ అంటూ చక్కటి కథనంతో ‘రెండాకులు’ మనుషుల్లోనూ అంతే ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన మనస్తత్వాన్ని కలిగి ఉండరు అనే గొప్ప సత్యాన్ని రచయిత తెలిపే ప్రయత్నం చేశారు. 

మరో కథ ‘గుహలో గొర్రెలు’ ఈ కథలో సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ఉపాయంతో పరిష్కరించుకోవాలి అనే నీతిని వివరించారు. అంతేకాకుండా ఈ కథలో ‘గొర్రె దాటు’ అనే సామెత కూడా చక్కగా అతికినట్టు కనిపిస్తుంది.   

గాడిద కష్టం చేసిన చాలామందికి గుర్తింపు రాదు. కానీ ఆ పని వెనక రాలిన చెమట చుక్కలను గుర్తించాల్సింది యజమానే అనే నీతిని ‘గాడిద కష్టం’లో రచయిత వివరించిన తీరు బాగుంది.
 మరో  కథ ‘పెట్టెలో ఏముంది’ అనే కథలో ట్యూషన్​కి వెళ్ళిన రవితేజ అక్కడ నేర్చుకున్న విషయాలను మననం చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని, ‘‘ట్యూషన్​లో చెప్పిన విషయాలను ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయకూడదు. మది అనే పెట్టెలో భద్రంగా దాచుకోవాలి. అప్పుడే అది చాలాకాలం గుర్తుండిపోతుంది’’ అని తాతయ్య చెప్పడం ఆ రోజు నుంచి శ్రద్ధగా ట్యూషన్​కి వెళ్తూ, పరీక్షల్లో రవితేజ ఉత్తీర్ణుడు అవుతాడు. 

మన వ్యతిరేక ఆలోచనలే మనకు శత్రువులు అనే చక్కటి నీతి కథ ‘గంప నేర్పిన గుణపాఠం’. పూలను ఆమ్ముకునే భద్రమ్మ ఆలోచన విధానంలో మార్పు వచ్చి పూల వ్యాపారంలో అభివృద్ధి సాధించడం ఈ కథ గొప్పతనం. ఇది వాస్తవానికి చాలా దగ్గరలో ఉంది. లేని దాని గురించి బాధపడడం కంటే ఉన్నదానితోనే సంతృప్తి చెందాలనే నీతిని ‘పొట్టి తోక ఎలుక’లో పాఠకులు తెలుసుకుంటారు. ఆర్. సి. కె. రాజు ఇంకా మునగాకు తాలింపు, బఠానీల వర్షం ఇలాంటి మరెన్నో కథలను వాస్తవానికి దగ్గరగా కథలను రాశారు. 

- యాడవరం చంద్రకాంత్ గౌడ్-