సౌదీలో బంగ్లాదేశీ జంటకుమరణశిక్ష.. మసీదులో అనైతిక చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణ

సౌదీలో బంగ్లాదేశీ జంటకుమరణశిక్ష.. మసీదులో అనైతిక చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణ
  • రహస్య విచారణ, పారదర్శకత లోపంపై విమర్శలు
  • దౌత్య నిబంధనలు ఉల్లంఘించారంటూ బంగ్లాదేశ్ నిరసన 

రియాద్: పవిత్ర నగరమైన మక్కాలోని ఒక మసీదులో అనైతిక చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశీ జంటకు సౌదీ అరేబియా ప్రభుత్వం అక్టోబర్ 14న మరణశిక్ష విధించి అమలుచేసింది. శిక్షకు గురైన వారిని నజ్రుల్ ఇస్లాం అబ్దుల్‌‌‌‌ బాసిత్, సితి అక్తర్‌‌‌‌గా గుర్తించారు. అయితే, వారు చేసిన నేరానికి సంబంధించిన వివరాలు వెల్లడించకపోవడం, విచారణ ప్రక్రియలో పారదర్శకత లోపించడంతో బంగ్లాదేశ్‌‌‌‌తో పాటు అంతర్జాతీయంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనేక రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. మొదట్లో వారిద్దరూ మసీదులో ముద్దు పెట్టుకున్నారని, ఆ తర్వాత నుదుటిపై ముద్దు పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. బాధితులిద్దరూ దంపతులని కొందరు భావించగా, నజ్రుల్ కుటుంబం ఆ ప్రచారాన్ని ఖండించింది. నజ్రుల్, సితి అక్తర్ ఇద్దరూ ఒకేచోట పనిచేసేవారని, తమకు ఆ యువతితో ఎలాంటి పరిచయంలేదని నజ్రుల్ తండ్రి తెలిపారు. కాగా, సౌదీ అధికారిక యంత్రాంగం మాత్రం ఈ ఘటనపై వివరాలను బయటపెట్టలేదు.

శిక్ష అమలు చేశాకే సమాచారం

చట్టగ్రామ్ డివిజన్‌‌‌‌కు చెందిన నజ్రుల్ ఇస్లాం 2022 నవంబర్‌‌‌‌లో సౌదీ అరేబియాకు వెళ్లి, మక్కాలోని మసీదులో క్లీనర్‌‌‌‌‌‌‌‌గా చేరారు. ఎనిమిది నెలల తర్వాత అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్న నజ్రుల్‌‌‌‌ను అక్టోబర్ 14న ఉరితీశారు. 

ఈ విషయంపై కుటుంబ సభ్యులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదు. శిక్ష అమలు చేసిన తర్వాత ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఒక పాకిస్తానీ సహోద్యోగితో వివాదం వచ్చిందని, అతడే తమ కుమారుడిపై కుట్ర పన్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సరైన న్యాయ విచారణ జరుపకుండానే మరణశిక్షను అమలుచేశారని నజ్రుల్ తండ్రి అబ్దుల్ బాసిర్ ఆవేదన వ్యక్తం చేశారు.

దౌత్య నిబంధనల ఉల్లంఘనే..

విదేశీ పౌరులను బంధించినా లేదా మరణశిక్ష విధించినా సంబంధిత దేశాల దౌత్య కార్యాలయాలకు సమాచారం అందించాలని వియన్నా ఒప్పందం పేర్కొంటోంది. కానీ, ఈ మరణశిక్ష గురించి సౌదీ అరేబియా ముందస్తుగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ తెలిపింది. 

సెప్టెంబరులో సౌదీ పంపిన ఖైదీల జాబితాలో వ్యభిచారం, ఐసీటీ నేరాల కింద వారి పేర్లు ఉన్నప్పటికీ, మరణశిక్ష విధిస్తున్నట్టు అందులో పేర్కొనలేదని వెల్లడించింది. రహస్యంగా మరణశిక్ష అమలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. ఢాకాలోని సౌదీ రాయబారికి సమన్లు జారీ చేసి వివరణ కోరింది. ఈ మరణశిక్ష సౌదీ అరేబియా న్యాయ వ్యవస్థలోని లోపాలను, పారదర్శకతలేమిని ఎత్తిచూపుతోందని చట్ట నిపుణులు, మానవ హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు.