- డీజేల నృత్యాల మధ్య కోలాహలం
- టస్కర్ వద్ద సాంకేతిక లోపంతో బడా
- గణేశ్ నిమజ్జనం 3 గంటలు ఆలస్యం
- ఉదయం 9.30కు మొదలు 2.25 గంటలకు పూర్తి
- నేటి సాయంత్రం వరకు గణేశ్ నిమజ్జనాలు
- రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
హైదరాబాద్ సిటీ/చార్మినార్, వెలుగు:తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న గణపయ్యకు భక్తులు ఘన వీడ్కోలు పలికారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర, నిమజ్జనం గ్రాండ్ సక్సెస్ అయింది. భారీ వినాయకుడిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఖైరతాబాద్, సెన్సెషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, ఇక్బాల్ మినార్, సెక్రటేరియెట్ ఏరియాలు భక్తజనంతో కిక్కిరిసి పోయాయి. మహా గణేశుడి ఎదుట మహాసాగరమే కదులుతుందా? అన్నట్టు శోభాయాత్ర సాగింది. మధ్యాహ్నం 2.15 గంటలకు హుస్సేన్‌సాగర్‌లో భారీ క్రేన్ల సాయంతో నిమజ్జన ప్రక్రియను పూర్తిచేశారు.
3 గంటలకుపైగా ఆలస్యం..
శుక్రవారం ఉదయం 6 గంటలకు బడా గణేషుడి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ఆలస్యమైంది. 69 అడుగుల భారీ విగ్రహాన్ని వాహనం ట్రాలీపైకి ఎక్కించి వెల్డింగ్ చేసే సమయంలో పైపు విరిగిపోయింది. దానికి రిపేర్లు చేసి శోభాయాత్ర స్టార్ట్ చేయడానికి 3 గంటలకు పైగా పట్టింది. దీంతో 9.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది. అయినా ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా బడా గణేషుడిని ట్యాంక్‌బండ్‌వైపు నడిపించారు. శోభాయాత్రకు ముందు ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజలు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్, ఉత్సవ కమిటీ సభ్యులు స్వామివారికి వాహన పూజ చేయడంతో పాటు హారతి ఇచ్చారు.
ఉదయం 9:37 గంటలకు ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తా వద్ద ఉన్న మండపం నుంచి శోభాయాత్ర ముందుకు కదిలింది. సెక్రటేరియెట్ చౌరస్తాలో భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి నాయకులు ఖైరతాబాద్ వినాయకుడికి ఘన స్వాగతం పలికారు. ఈ ప్రోగ్రాంలో ఖైరతాబాద్ బడా గణేశ్ ఉత్సవ కమిటీ నాయకులతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ విజయా రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
3 కార్పొరేషన్ల పరిధిలో..
మూడు కార్పొరేషన్ల పరిధిలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగింది. జీహెచ్ఎంసీలో 39 చోట్ల, సీఎంసీలో 53, ఎంఎంసీలో 39 ప్రాంతాల్లో కొనసాగింది. హుస్సేన్ సాగర్‌లో శనివారం సాయంత్రం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశముంది. ఇందుకోసం హుస్సేన్ సాగర్ వద్ద 41 క్రేన్లను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పై 15, ఎన్టీఆర్ మార్గ్‌లో 9, పీవీ మార్గ్‌లో 9 ఏర్పాటు చేయగా.. బేబీ పాండ్స్ వద్ద ఆరు క్రేన్లను అందుబాటులో ఉంచారు. వీటితోపాటు ఖైరతాబాద్ బడా గణేశ్ కోసం ఒకటి ఏర్పాటు చేయగా, మరొకటి రిజర్వులో ఉంచారు.
బడా గణేశ్ నిమజ్జనం పూర్తయ్యాక మిగతా విగ్రహాల శోభాయాత్ర ఊపందుకున్నది. బాలాపూర్ గణేశ్ నిమజ్జనం అప్పర్ ట్యాంక్ బండ్‌లో జరిగింది. సాగర్‌కు సాయంత్రం 7 గంటల తర్వాత భారీగా విగ్రహాలు తరలివచ్చాయి. నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు జనసందోహంతో నిండిపోయాయి. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌లో 18 నుంచి 22 ఫీట్ల విగ్రహాలను నిమజ్జనానికి అనుమతించారు. అంతకు తక్కువగా ఉన్న విగ్రహాలను పీపుల్స్ ప్లాజా, పీవీ మార్గ్బేబీ పాండ్స్‌లో నిర్వహించేందుకు పర్మిషన్ ఇచ్చారు. హుస్సేన్ సాగర్‌తోపాటు జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహుదూర్ పురా మీరాలం చెరువు, సరూర్ నగర్ పెద్ద చెరువు, కాప్రా ఊర చెరువు, కూకట్‌పల్లి ఐడీఎల్ లేక్ వద్ద కూడా సందడి నెలకొన్నది. బేబీ పాండ్స్ వద్ద కూడా జనసంద్రం కనిపించింది.
బాలాపూర్ లడ్డూ @ 39 లక్షలు
బాలాపూర్ లడ్డూకు ఈసారి కూడా రికార్డు ధర లభిం చింది. 21 కిలోల లడ్డూను వనస్థలిపురం సాహెబ్ నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్స్ కంపెనీ అధినేత సామ ప్రణీత్ రెడ్డి రూ. 39 లక్షలకు సొంతం చేసుకున్నారు. నిరుడు రూ. 35 లక్షలు పలికిన లడ్డూ ఈసారి రూ. 4 లక్షలు అదనంగా పలికి రికార్డు నమోదు చేసింది. 1994లో కేవలం రూ. 450 ప్రారంభ ధరతో మొదలైన బాలాపూర్ లడ్డూ వేలం పాట.. గడిచిన 32 ఏండ్లలో ఏటా పెరుగుతూ ప్రస్తుతానికి ఈ స్థాయికి చేరింది. అనంతరం బాలాపూర్ గణేషుడు ఈసారి తొందరగానే గంగమ్మ ఒడి చేరాడు. ప్రతిసారి 16 కిలోమీటర్లు కొనసాగే ఈ యాత్రకు సుమారు 10 గంటలైనా పట్టేది. కానీ, ఈసారి నాలుగు గంటల్లోనే నిమజ్జనం ముగిసింది.
24 డ్రోన్ కెమెరాలతో రూట్ క్లియరెన్స్
ఖైరతాబాద్ విగ్రహ మండపం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు ఉన్న 2.5 కిలోమీటర్ల ప్రత్యేక శోభాయాత్ర మార్గంలోనే శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి 80 మందికి పైగా ఉన్నతాధికారులను కేటాయించారు. శోభాయాత్ర మార్గాలను, ట్యాంక్ బండ్ పరిసరాలను నిశితంగా గమనించడానికి సీసీ టీవీ కెమెరాలు, 40 హైరైజ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని బంజారాహిల్స్‌లోని తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించారు. జన సందోహాన్ని, రూట్ క్లియరెన్స్‌ను పైనుంచి పర్యవేక్షించడానికి 24 నిఘా డ్రోన్లను ఉపయోగించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ నిఘా పెట్టారు.
