శ్రీకృష్ణాష్టమి పూజకు శుభముహూర్తం ,రోహిణి నక్షత్రం ఎప్పుడు ... ఉపవాసం విరామించాల్సిన సమయం ఇదే..!

శ్రీకృష్ణాష్టమి పూజకు శుభముహూర్తం ,రోహిణి నక్షత్రం ఎప్పుడు ... ఉపవాసం విరామించాల్సిన సమయం ఇదే..!

హిందూ పురాణాల ప్రకారం, శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన వేణుమాధవుడు జన్మించిన రోజునే ప్రపంచవ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి, శ్రీ కృష్ణ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది కృష్ణాష్టమి తిథి ఎప్పుడు వచ్చింది.. రోహిణి నక్షత్రం ఏ సయమంలో ఉంది.  నిశిత కాలం ఎప్పుడు.. జన్మాష్టమి వేడుకలు ఎప్పుడు జరుపుకోవాలి.. మొదలగు విషయాలను తెలుసుకుందాం. . ! 

హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడి పుట్టినరోజు.. శ్రీకృష్ణ జన్మాష్టమిని’ దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పర్వదినం శ్రీకృష్ణుడి అవతారాన్ని స్మరించుకునే అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. 

శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి.. రోహిణి నక్షత్రంతో శ్రీకృష్ణుడి జననం ముడిపడి ఉండటంతో ఆ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  ఈ ఏడాది ( 2026)  జన్మాష్టమి సెప్టెంబర్4 న వచ్చింది. జన్మాష్టమి తిథి సమయం..  రోహిణి నక్షత్రం, నిశిత కాలం ఆధారంగా  కృష్ణాష్టమి పూజ ను జరుపుకుంటారు.

కృష్ణ జన్మాష్టమి శుభ సమయం

ఈ ఏడాది ( 2026)  శ్రీ కృష్ణాష్టమి 04 సెప్టెంబర్ 2026 శుక్రవారం నాడు జన్మాష్టమి వేడుకలను జరుపుకోనున్నారు.

  • అష్టమి తిథి ప్రారంభం : సెప్టెంబర్ 4న శుక్రవారం తెల్లవారుజామున   1:50 గంటలకు 
  • అష్టమి తిథి ముగింపు : సెప్టెంబర్ 5న శనివారం అర్ధరాత్రి 12:13 గంటలకు 
  • రోహిణి నక్షత్ర సమయం : సెప్టెంబర్ 4 శుక్రవారం రాత్రి 11:26 గంటల వరకు 
  • పూజా సమయం : శుక్రవారం రాత్రి 11:57 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున12:43 గంటల వరకు ( 46 నిమిషాల సమయం)

కన్నయ్య అర్ధరాత్రి జన్మించాడని నమ్ముతారు కాబట్టి, జన్మాష్టమిని శుక్రవారం నాడు జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.  ఈ సమయంలో బాలగోపాలుని జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతాయి.శ్రీకృష్ణుడి జన్మవేళను అర్ధరాత్రి నిశిత కాలంతో అనుసంధానించి జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. అందువల్ల సెప్టెంబర్ 4న జన్మాష్టమి ఉపవాసం పాటించి, అదే రోజు రాత్రి శ్రీకృష్ణుడి జన్మోత్సవాన్ని జరుపుకోవడం శుభప్రదంగా భావిస్తారు.

రోహిణి నక్షత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత

శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడని హిందూ సంప్రదాయ విశ్వాసం. అందుకే జన్మాష్టమి సందర్భంగా రోహిణి నక్షత్రానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. 2026లో రోహిణి నక్షత్రం సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 12:29 గంటలకు ప్రారంభమై,  అదే రోజు  రాత్రి 11:26 గంటల వరకు కొనసాగుతుంది. దీంతో ఈసారి జన్మాష్టమి పూజలో తిథితో పాటు రోహిణి నక్షత్రాన్ని కూడా భక్తులు ప్రత్యేకంగా పరిగణిస్తారు. 

జన్మాష్టమి రోజున భక్తులు రాత్రి వరకు ఉపవాసం ఉండి, అర్ధరాత్రి సమీపంలో బాలకృష్ణుడి జననాన్ని స్మరించుకుంటారు. అనంతరం బాలగోపాలుడికి అభిషేకం, అలంకరణ, పూజ, హారతి నిర్వహించి నైవేద్యాలు సమర్పిస్తారు.

నిశిత కాలంలో శ్రీకృష్ణుడి పూజకు శుభ సమయం ఇదే..!

జన్మాష్టమి వేడుకల్లో నిశిత కాలం అత్యంత ముఖ్యమైన సమయంగా పరిగణించబడుతుంది. 2026లో నిశిత పూజకు అనుకూలమైన సమయం సెప్టెంబర్ 4 రాత్రి 11:57 గంటల నుంచి సెప్టెంబర్ 5 తెల్లవారుజామున 12:43 గంటల వరకు ఉంటుంది. అంటే మొత్తం సుమారు 46 నిమిషాల పాటు నిశిత కాలం ఉంటుంది. 

ఈ సమయంలో భక్తులు శ్రీకృష్ణుడి బాలరూపమైన లడ్డు గోపాలుడికి పంచామృత అభిషేకం చేసి, కొత్త వస్త్రాలు ధరింపజేసి, అందంగా అలంకరిస్తారు. అనంతరం వెన్న, మిశ్రి, పాలు, పండ్లు, ఇతర ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి, అర్ధరాత్రి సమయంలో హారతి ఇస్తారు. శంఖనాదం, గంటల మోగింపుతో శ్రీకృష్ణుడి జన్మోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.

జన్మాష్టమి ఉపవాసం ఎప్పుడు విరమించాలి?

జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించే భక్తులు సాధారణంగా శ్రీకృష్ణుడి జననం అనంతరం నిశిత కాలంలో పూజ చేసి, ఆ తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు. పంచాంగం ప్రకారం, సెప్టెంబర్ 5న ఉదయం 6:01 గంటల తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. 

జన్మాష్టమి రోజున అర్ధరాత్రే పుట్టినరోజు ఎందుకు జరుపుకుంటారు?

 పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి అర్ధరాత్రి సమయంలో మథురలోని కారాగారంలో జన్మించాడు. ఆయన జన్మించిన సమయంలో రోహిణి నక్షత్రం కూడా ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే జన్మాష్టమి రోజున అర్ధరాత్రి సమయాన్ని శ్రీకృష్ణుడి జననానికి ప్రతీకగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు ఆ సమయంలో శంఖాలు, గంటలు మోగిస్తూ, శ్రీకృష్ణుడికి హారతి ఇచ్చి, వెన్న-మిశ్రి, పాలు, పండ్లు తదితర ప్రసాదాలను సమర్పిస్తారు.

ఆ రోజు ( 2026 సెప్టెంబర్​ 4) దేశవ్యాప్తంగా అనేక కృష్ణ మందిరాల్లో   ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, భజనలు, కీర్తనలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. చిన్నారులను బాలకృష్ణుడి వేషధారణలో అలంకరించడం, ఉట్టి కొట్టే వేడుకలు నిర్వహించడం వంటి సంప్రదాయాలతో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు.