బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు..

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో రానున్న నాలుగు రోజులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని ఉత్తరకోస్తా జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు.. కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది విశాఖ వాతావరణ కేంద్రం. విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.

అల్పపీడనంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని.. ఈ ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.

వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా,పశ్చిమ బెంగాల్ తీరంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 

ఇవాళ భారీ వర్షాలకు ఛాన్స్

ఇవాళ ( జూన్ 26 ) ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.

శుక్రవారం ( జూన్ 27 ) ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.