గ్యాస్ సిలిండర్ బుక్ చేసారా..? డెలివరీ పేరుతో కొత్త స్కామ్.. ఓటీపీ చెబితే అకౌంట్ ఖాళీ..

గ్యాస్ సిలిండర్ బుక్ చేసారా..? డెలివరీ పేరుతో కొత్త స్కామ్.. ఓటీపీ చెబితే అకౌంట్ ఖాళీ..

డిజిటల్ మోసాలు పెరిగిపోతుండటంతో ఇండేన్, హెచ్‌పి, భారత్ గ్యాస్ కంపెనీలు కస్టమర్లను అలెర్ట్ చేశాయి. గ్యాస్ ఏజెన్సీ అధికారులమని చెప్పి ఫోన్ చేసి, మీ బ్యాంక్ అకౌంట్లోని  డబ్బులు కొట్టేసే ముఠాలు ఎక్కువవుతున్నాయని, అందుకే డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాయి.

ఈ మోసం ఎలా జరుగుతుందంటే 
మోసగాళ్లు ముందుగా మీకు గ్యాస్ కంపెనీ నుంచి వచ్చినట్లుగానే నకిలీ SMS లేదా వాట్సాప్ మెసేజ్ పంపిస్తారు. ఆ తర్వాత ఫోన్ చేసి..  మేము గ్యాస్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాం, మీ ఫోన్‌కు వచ్చిన కోడ్ చెబితేనే సిలిండర్ ఇంటికి డెలివరీ వస్తుంది, లేకపోతే క్యాన్సల్ అవుతుంది అని చెప్తూ భయపెడతారు. మీరు ఆ కోడ్ చెప్పగానే, మీ గ్యాస్ ప్రొఫైల్ ద్వారా లేదా ఇతర యాప్స్ ద్వారా మీ బ్యాంక్ వివరాలు సేకరించి అకౌంట్ ఖాళీ చేస్తారు.

మీరు పాటించాల్సినవి:
*గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి తీసుకువచ్చినప్పుడు మాత్రమే, 4 లేదా 6 అంకెల కోడ్‌ను (DAC) డెలివరీ వ్యక్తికి చెప్పండి.
* ఏ కంపెనీ ఉద్యోగి కూడా ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా ఈ  (DAC) కోడ్ అడిగే అధికారం లేదు. ఫోన్ చేసి కోడ్ అడిగితే చెప్పొద్దు, అది కచ్చితంగా మోసం అని గుర్తుంచుకోండి.
* గ్యాస్ కంపెనీల మెసేజ్‌లు సాధారణంగా VM-HPGAS, VK-INDANE, లేదా AD-BPCL వంటి అధికారిక ఐడీల నుంచే వస్తాయి. సాధారణ మొబైల్ నంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లను నమ్మకండి.

ప్రస్తుత పరిస్థితులు
ప్రస్తుతం గ్యాస్ ధరలు నిలకడగా ఉన్న, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో సబ్సిడీ లేని గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది. సేఫ్ బుకింగ్ కోసం ఇండియన్‌ఆయిల్ వన్, హలో బిపిసిఎల్ లేదా హెచ్‌పి పే వంటి అధికారిక యాప్‌లను మాత్రమే వాడండి.  

మే 11, 2026న ఎల్పీజీ ధరలు చూస్తే 

మధ్యప్రాచ్య  దేశాల్లో ఘర్షణల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల్లో మార్పులు వస్తున్నప్పటికీ, మన దేశంలో 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం ఖరారు చేసిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో రేట్లు చూస్తే  న్యూఢిల్లీ రూ.903.00, ముంబై రూ.902.50, కోల్‌కతా  రూ.929.00, చెన్నై రూ.918.50, పాట్నా రూ.1002.50, బెంగళూరు రూ.915.50, హైదరాబాద్ రూ.965.00