బ్రెజిల్ అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లూలా డా సిల్వానాలుగోసారి అధ్యక్షుడిగా గెలుపొందారు. 2026 అక్టోబర్ 25 (ఆదివారం) జరిగిన రన్-ఆఫ్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ అభ్యర్థి ఫ్లావియో బోల్సనారోను ఓడించి గెలిచారు. లాటిన్ అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో వామపక్ష నాయకత్వాన్ని కొనసాగిస్తూ ఆయన విజయ ఢంకా మోగించారు.
ఈ సందర్భంగా సావో పాలోలో మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ లూలా బ్రెజిల్ ఎవరి వెనకాల నడవదని ట్రంప్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ప్రభావానికి తలొగ్గే పరిస్థితి లేదన్నారు. మా ప్రచారం ద్వారా విదేశీ జోక్యాన్ని ఎదుర్కోగలిగాం అని ఈ సందర్భంగా అన్నారు.
78 శాతం ఓట్లు లెక్కించిన తర్వాత లూలా 51.21 శాతం, బోల్సనారో 48.79 శాతం ఓట్లు సాధించారు. డేటాఫోలా సర్వే ముందుగానే లూలా విజయాన్ని అంచనా వేసింది. ఫ్లావియో బోల్సనారో ఫలితాలను రద్దు చేయాలని కోరారు. అయితే ఈ గెలుపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులకు లాటిన్ అమెరికాలో ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
జైలులో ఉన్న మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనారో కుమారుడు, సెనేటర్ అయిన ఫ్లావియో వాషింగ్టన్‌తో సంబంధాలు బలోపేతం చేసి మెరుగైన వాణిజ్య ఒప్పందాలు కోరుకున్నారు.
లూలా కన్జర్వేటివ్ నేతృత్వంలోని కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తానని, దేశం మొత్తం కోసం పాలన సాగిస్తానని చెప్పారు. నేను 215 మిలియన్ బ్రెజిలియన్ల కోసం పాలన చేస్తాను. ప్రజల భాగస్వామ్యం పెంచి పాలనా విధానం మారుస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పాల్గొనడం ప్రజాస్వామ్య సంస్థలను రక్షించడానికి అవసరమని ప్రజలను ఒప్పించగలిగామని ఆయన అన్నారు.
ఈ ఎన్నికల్లో అమెరికాతో సంబంధాలు, నేరాలు, వాతావరణ విధానం, సామాజిక సంక్షేమం ప్రధాన అంశాలయ్యాయి. జీవన వ్యయం, నేరాలు ప్రచారంలో కీలకం. బోల్సనారో కఠినమైన నేర నిరోధక విధానం, ఆహార ధరలు తగ్గించడం మీద దృష్టి పెట్టారు. లూలా అనిశ్చిత ఓటర్లను ఆకర్షించేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించారు. రెండు వర్గాలపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
లూలా గెలుపుతో బ్రెజిల్, మెక్సికో రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వామపక్ష నాయకత్వం కొనసాగుతుంది. ట్రంప్ పాలనతో సన్నిహిత సంబంధాలు కోరుకునే కన్జర్వేటివ్ శక్తులకు ఇది ఎదురుదెబ్బ. వాణిజ్యం, అమెరికా ప్రభావం, ప్రాంతీయ దౌత్యం వంటి విషయాల్లో బ్రెజిల్-అమెరికాతో విభేదాలు కొనసాగించే అవకాశం ఉంది.
