చెన్నై: తమిళనాడు సీఎం, టీవీకే చీఫ్ విజయ్ విడాకుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం విజయ్ భార్య సంగీత కోర్టులో విడాకుల పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. దీంతో చెంగల్పట్టు జిల్లా కోర్టు విజయ్ విడాకుల కేసు విచారణను ముగించింది.
అసలేం జరిగిందంటే..?
విజయ్ నుంచి విడాకుల కోరుతూ 2026, ఫిబ్రవరిలో ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. విడాకుల పిటిషన్లో ఆమె పేర్కొన్న అంశాలు కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.
తనను మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారని, కనీస ఆర్థిక స్వేచ్ఛ కూడా ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. తన కదలికలపై ఆంక్షలు విధించారని, మాటలతో తీవ్రంగా కించపరిచారని ఆమె వాపోయారు. ఇక విజయ్‌తో కలిసి జీవించలేనని.. తనకు విడాకులు ఇప్పించాలని ఆమె కోరారు.
సంగీత పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు విజయ్‌కు నోటీసులు సైతం జారీ చేసింది. ఈ తరుణంలో సంగీత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఆమె ఉపసంహరించుకున్నారు. చెంగల్పట్టు కోర్టు విజయ్ విడాకుల కేసు విచారణను ముగించింది. దీంతో తమిళనాడు సినీ, పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారిన విజయ్ విడాకుల కేసు వ్యవహారం ముగిసింది.
