మాతో డీల్ కుదుర్చుకోకుంటే ఇరాన్‎పై మళ్లీ దాడులు.. ట్రంప్ ఎపిక్ ఫ్యూరీ వార్నింగ్‌‌‌‌

మాతో డీల్ కుదుర్చుకోకుంటే ఇరాన్‎పై మళ్లీ దాడులు.. ట్రంప్ ఎపిక్ ఫ్యూరీ వార్నింగ్‌‌‌‌

వాషింగ్టన్: అమెరికాతో ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్‌‌‌‌పై మరో విడత సైనిక దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మరోసారి ‘చిన్నపాటి ఎపిక్ ఫ్యూరీ’ తరహా దాడికి వెనుకాడబోమని ఆయన స్పష్టంచేశారు. ‘‘మేం మరో చిన్నపాటి ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ అయినా చేపడతాం లేదా వారే ఒప్పందానికి వస్తారు. వారికి బుద్ధి ఉంటే చర్చలకు సిద్ధమవుతారు’’ అని పేర్కొన్నారు. 

ఈ సైనిక చర్యలను తప్పించుకోవడానికి ఇరాన్ ఎలాంటి షరతులను పాటించాలనే విషయాన్ని వెల్లడించలేదు. గత ఫిబ్రవరిలో ఇరు దేశాలు చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. మరో ఆపరేషన్ ‘మిడ్‌‌‌‌నైట్ హ్యామర్’ ద్వారా ఇరాన్ అణు సామర్థ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశామని ట్రంప్ చెప్పారు.

ఈ వారాంతంలోనే దాడి!

ఈ వారాంతంలోనే ఇరాన్‌‌‌‌పై దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని తుర్కియేలోని అమెరికా రాయబారి టామ్ బారక్ ఒక పాడ్‌‌‌‌కాస్ట్‌‌‌‌లో వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలను ట్రంప్ పెద్దగా పరిగణనలోకి తీసుకోకుండా, తనకు ఆ విషయంపై ఎలాంటి సమాచారం లేదని కొట్టిపారేశారు. యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆశిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. కాగా, అమెరికా హెచ్చరికలపై ఇరాన్ సైతం ఘాటుగా స్పందించింది. 

అమెరికా ‘నిప్పుతో చెలగాటమాడకూడదు’ అని వార్నింగ్‌‌‌‌ ఇచ్చింది. తమపై మళ్లీ దాడి జరిగితే గల్ఫ్ ప్రాంతంలోని సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుల్స్‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ప్రకటించింది. ఇంటర్నెట్, సమాచార వ్యవస్థలను దీర్ఘకాలం స్తంభింపజేస్తామని తెలిపింది. ‘‘ఇరాన్‌‌‌‌పై దాడి జరిగితే ఇక ఎలాంటి సరిహద్దులు, రెడ్‌‌‌‌ లైన్స్‌‌‌‌ ఉండవు.. సైనిక స్థావరాల నుంచి కేబుల్స్ దాకా దేన్నీ వదలం’’ అని ఇరాన్ అధికారి ఒకరు హెచ్చరించారు.

భారత్‌‌‌‌-పాక్‌‌‌‌ యుద్ధాన్ని ఆపింది నేనే

భారత్–పాకిస్తాన్‌‌‌‌ మధ్య తలెత్తిన సైనిక ఘర్షణను తానే అడ్డుకున్నానని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఇరుదేశాలపై భారీగా వాణిజ్య సుంకాలు విధిస్తానని హెచ్చరించడం వల్లే ఆ ఘర్షణ ఆగిపోయిందని వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌‌‌‌ ప్రసంగించారు. 

‘‘అణ్వాయుధ సంపత్తి కలిగిన భారత్, పాకిస్తాన్‌‌‌‌ల మధ్య యుద్ధం తీవ్రతరమవుతున్న తరుణంలో నేను జోక్యం చేసుకున్నాను. మీరు యుద్ధం కొనసాగిస్తే అమెరికాతో ఎలాంటి వ్యాపారం ఉండదు, రెండు దేశాలపై 250% భారీ సుంకాలు విధిస్తామని గట్టిగా చెప్పాను. దీంతో రెండు దేశాలు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కాల్పులు విరమించాయి’’ అని వివరించారు. 

ఈ ఘర్షణలో 11 యుద్ధ విమానాలు కూలిపోయాయని, యూఎన్‌‌‌‌వో ప్రమేయం లేకుండానే యుద్ధాన్ని నిలువరించానని పేర్కొన్నారు. ఇప్పటివరకు 8 యుద్ధాలను ఆపినా తనకు నోబెల్ దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.