Altaf Salim: చిన్న పాత్రలతో మొదలై.. నటుడిగా, డైరెక్టర్గా భారీ క్రేజ్.. అల్తాఫ్ సలీమ్ అద్భుత జర్నీ!

Altaf Salim: చిన్న పాత్రలతో మొదలై.. నటుడిగా, డైరెక్టర్గా భారీ క్రేజ్.. అల్తాఫ్ సలీమ్ అద్భుత జర్నీ!

సినిమాలో కొన్ని పాత్రలు నిడివితో కాదు.. తెరపై కనిపించిన క్షణాలతో గుర్తుండిపోతాయి. అలాంటి పాత్రలకు తనదైన హాస్యాన్ని, సహజత్వాన్ని అద్దే నటుడు అల్తాఫ్​ సలీమ్‌ (Altaf Salim). చిన్న పాత్రలతో సినీ ప్రయాణం మొదలుపెట్టి, నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు దర్శకుడిగానూ సత్తా చాటుతున్నారు. ‘ప్రేమమ్‌’తో మొదలైన ఆయన ప్రయాణం ‘ప్రేమలు’తో మరో స్థాయికి చేరింది. ఆ తర్వాత వరుస చిత్రాల్లో విభిన్న పాత్రలు చేస్తూ, మరోవైపు దర్శకత్వంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ముందుకు సాగుతున్న మల్టీటాలెంటెడ్​ అల్తాఫ్‌ జర్నీ ఇది.

కేరళలో జన్మించిన అల్తాఫ్​ సలీమ్‌ చిన్నతనం నుంచే సినిమాపై ఆసక్తి పెంచుకున్నాడు. ఆ ఆసక్తినే కెరీర్‌గా మలుచుకున్నాడు. నటనతోపాటు కథలు చెప్పాలనే తపన ఆయనలో మొదటినుంచే ఉండేది. అదే తర్వాత ఆయనను నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా నిలబెట్టింది. 2015లో వచ్చిన ‘ప్రేమమ్‌’ అల్తాఫ్​ సినీ ప్రయాణానికి కీలకమైన ఆరంభం. అల్ఫోన్స్‌ పుత్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన జహంగీర్‌ పాత్రలో కనిపించారు. పాత్ర నిడివి పెద్దది కాకపోయినా అల్తాఫ్​ తన సహజమైన హావభావాలు, హాస్యభరితమైన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమా సక్సెస్​తో మరిన్ని అవకాశాలు వచ్చాయి.

ఒక్కో పాత్రతో గుర్తింపు..

‘ప్రేమమ్‌’ తర్వాత అల్తాఫ్​ ‘సఖావు’, ‘ఒరు అదార్‌ లవ్‌’, ‘లవర్స్‌ డే’, ‘ఆపరేషన్‌ జావా’, ‘ముకుందన్‌ ఉన్ని అసోసియేట్స్‌’, ‘పాచువుమ్‌ అద్భుత విలక్కుమ్‌’ వంటి సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు. ఆయన నటనలో ప్రధానంగా కనిపించే అంశం సహజత్వం. పాత్ర ఎంత చిన్నదైనా దాన్ని అతిగా చూపించకుండా, కథకు అవసరమైన స్థాయిలోనే నటించడం ఆయన ప్రత్యేకతగా మారింది. అయితే అల్తాఫ్​ లక్ష్యం నటుడిగా అవకాశాలు పొందడానికే పరిమితం కాలేదు. తెరపై ఇతరులు రాసిన కథల్లో పాత్రలు పోషించడంతోపాటు, తానే కథ చెప్పాలనే కోరిక ఆయనను దర్శకత్వం వైపు నడిపించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pluto (@pluto.movie)

మెగాఫోన్‌ పట్టిన తొలి అడుగు

2017లో ‘న్జండుకలుడే నాటిల్‌ ఒరిడవేళ’తో అల్తాఫ్​ దర్శకుడిగా పరిచయమయ్యారు. నివిన్​ పౌలీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం కుటుంబ బంధాలు, అనారోగ్యం, మనుషుల మధ్య అనుబంధాలను కథగా తీసుకుంది. సున్నితమైన అంశాన్ని విషాదభరితంగా కాకుండా హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో చెప్పడం ఈ చిత్రంలో కనిపించింది.

దర్శకుడిగా తొలి సినిమాతోనే అల్తాఫ్​ తన కథ చెప్పే శైలిని పరిచయం చేశారు. సాధారణ జీవితంలోని పరిస్థితుల్లోనే హాస్యాన్ని వెతుక్కోవడం, పాత్రలను సహజంగా చూపించడం ఆయనకు ఇష్టమైన విధానంగా కనిపించింది. తొలి సినిమా తర్వాత కొంత విరామం తీసుకున్న ఆయన.. ఆ సమయంలో నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగించారు.

నటుడిగా బిజీ.. దర్శకుడిగా మరోసారి

నటుడిగా వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే అల్తాఫ్​ మళ్లీ దర్శకత్వం వైపు అడుగేశారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఫహద్‌ ఫాజిల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఒడుమ్‌ కుతిర చాడుమ్‌ కుతిర’కు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలు కూడా ఆయనవే. ఈ సినిమాతో అల్తాఫ్​ తన దర్శకత్వ శైలిలో మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేశారు. హాస్యాన్ని ఒకేరకంగా కాకుండా విభిన్న విధానాల్లో ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన ఇంటర్వ్యూల్లో చెప్పారు. నటుడిగా కెమెరా ముందు అనుభవం, దర్శకుడిగా కెమెరా వెనక అవగాహన.. రెండూ కలిసినప్పుడు వచ్చే ఫలితం ఈ సినిమాలో కనిపించింది.

వరుస ప్రాజెక్టులతో ముందుకు..

2024 తర్వాత అల్తాఫ్​ కెరీర్‌ మరింత వేగం అందుకుంది. ‘మందాకిని’, ‘అడియోస్‌ అమిగో’, ‘విశేషం’, ‘నునక్కుళి’, ‘ప్రతిభ ట్యుటోరియల్స్‌’ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. ఆ తర్వాత ‘ఎన్ను స్వంతం పుణ్యాలన్‌’, ‘అన్‌పోడు కన్మణి’, ‘ఇన్నసెంట్‌’, ‘సర్వం మాయ’ వంటి చిత్రాల్లోనూ భాగమయ్యారు. 2026లోనూ ఆయన చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

‘మ్యాజిక్‌ మష్రూమ్స్‌’, ‘మాలీవుడ్‌ టైమ్స్‌’, ‘సీక్రెట్‌ ఆఫ్‌ కలింగ’, ‘ప్లూటో’ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో తాజాగా చేరాయి. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్టులు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. ఒకే తరహా పాత్రలతో ఆగిపోకుండా, కథకు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకోవడం ఆయన కెరీర్‌లో కనిపించే మరో ప్రత్యేకత.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vinod Leela (@vinod_leela)

‘ప్రేమలు’తో భారీ గుర్తింపు

అల్తాఫ్​ కెరీర్‌లో మరో కీలక మలుపు ‘ప్రేమలు’. 2024లో విడుదలైన ఈ చిత్రం యువతలో విపరీతమైన ఆదరణ పొందింది. ఇందులో షోభి సర్‌ పాత్రలో కనిపించిన అల్తాఫ్​.. కథలో ప్రధాన పాత్ర కాకపోయినా తన హాస్యంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పాత్రలో ఆయన చూపించిన టైమింగ్‌, ముఖ కవళికలు, సంభాషణ చెప్పే తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘ప్రేమలు’ విజయం ఆయనకు దేశవ్యాప్తంగా కొత్త ప్రేక్షకులను పరిచయం చేసింది. అదే సమయంలో ‘మందాకిని’లో ఆరోమల్‌ పాత్రలో ప్రధాన పాత్రధారిగా కనిపించారు. దీంతో కేవలం సహాయ పాత్రలు, హాస్య పాత్రలకే పరిమితమైన నటుడు కాదని నిరూపించుకున్నారు.