
చాలామందికి చిన్నప్పటి నుంచి ఒక కల ఉంటుంది. అది నెరవేర్చుకునే అవకాశం అందరికీ దొరక్కపోవచ్చు. కానీ మనసులో గట్టిగా నిర్ణయించుకుని దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటే కచ్చితంగా గమ్యం చేరొచ్చు అనడానికి ఈ అమ్మాయి జర్నీనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈమెపేరు తన్విరామ్. వాళ్లది బెంగుళూరులో సెటిల్ అయిన మలయాళీ ఫ్యామిలీ. చాలామందిలానే తను బాగా చదువుకుని బ్యాంక్‌లో జాబ్ తెచ్చుకుంది. కొన్నాళ్లు జాబ్ చేశాక తనకు నచ్చినదానిపై ఫోకస్ చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్న రంగంలో చాన్స్ వచ్చినా, అది ఫైనలైజ్ అయ్యేవరకు జాబ్ మాత్రం వదల్లేదు. ఆ తర్వాతే జాబ్‌కి రిజైన్ చేసి కొత్త ఇండస్ట్రీలో ప్రయాణం ప్రారంభించింది. చేసింది కొన్ని సినిమాలే అయినా అన్నింట్లోనూ తనదైన ముద్ర వేసుకుంది తన్వి. ఆమె జర్నీ విశేషాలు ఇవి.
తన్విరామ్ అసలు పేరు శ్రుతి రామ్. మలయాళం, తెలుగు సినిమాల్లో నటించిన ఈమె సినిమాల్లోకి రాకముందు బెంగళూరులో ఏడేండ్లు బ్యాంక్ జాబ్ చేసింది. 2019లో వెండితెరకు పరిచయం అయింది. ‘అంబిలి’ అనే సినిమాలో సౌబిన్ సాహిర్‌కు జోడిగా నటించింది. 2023లో 2018 సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ వెంటనే తెలుగులో ‘క’ సినిమాలో రాధ పాత్రలో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘అభిలాషమ్’ అనే సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.
ఇవేకాకుండా.. టీవీలో వచ్చే కమర్షియల్ యాడ్స్ కూడా చాలా చేసింది తన్వి. తన్వీకి ట్రావెలింగ్, అడ్వెంచర్ యాక్టివిటీలు చేయడమంటే మహా ఇష్టం. అంతేకాదు.. పియానో వాయించడం అంటే చాలా ఇష్టం. పియానో వాయిస్తూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందట ఈ అమ్మాయి. నటిగా రాణిస్తూనే మోడలింగ్, ప్రింట్ మీడియా షూట్స్‌లో అవకాశం వచ్చినా పాల్గొంటుంటుంది తన్వి.
‘క’లో అవకాశం అలా..
మొదటి సినిమా అంబిలి తర్వాత కప్పేలాలో అవకాశం వచ్చింది. అదే ఏట అంటే సుందరానికి సినిమాలో హీరోయిన్ అక్కగా చాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఆరట్టు, తల్లుమాల, కుమారి, ముకుందన్ ఉన్ని అసోసియేట్స్, ఎంకిలమ్ చంద్రికే, ఖాళీ పర్స్ ఆఫ్ బిలియనీర్, 2018 వంటి సినిమాల్లో నటించా. ‘2018’ సినిమా చూసి ‘క’ డైరెక్టర్స్ సినిమాలో అవకాశం ఇచ్చారు. మొదట ఫోన్లో స్టోరీ లైన్ చెప్పారు. ఆ తర్వాత మీటింగ్‌లో కథ విన్నాను. ‘క’ సినిమా స్క్రిప్ట్ వింటున్నప్పుడు బ్రేక్ కూడా తీసుకోవాలి అనిపించలేదు.
అంత ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కథ విన్న వెంటనే ఒప్పుకున్నాను. అందులో రాధ పాత్ర కూడా నాకు చాలా నచ్చింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ కాబట్టి అందుకు తగినట్టు కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. మేకప్ కూడా అలానే, నేనున్న స్కిన్ టోన్ కలర్ కాకుండా కాస్త తగ్గించి డార్క్ మేకప్ వేశారు. చాలా కష్టపడి, నిజాయితీగా పనిచేశాం. దానికి తగ్గ రిజల్ట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.
డ్యూటీకి వెళ్తూ.. మూవీ చూశా
నేను జాబ్ చేసేటప్పుడు ట్రాఫిక్‌లో డ్యూటీకి వెళ్లడానికి చాలా టైం పట్టేది. నేను బుక్ చేసుకున్న క్యాబ్‌లో ఎక్కువసార్లు తెలుగు సినిమాలు ప్లే చేయడం వల్ల నార్మల్‌గా కంటే అలానే చాలా మూవీస్ చూశా. కానీ, ఎప్పుడూ తెలుగులో నటిస్తానని అనుకోలేదు. తెలుగు సినిమాలు చూసి భాషను అర్థం చేసుకున్నా. తెలుగులో నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. తనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. ‘అభిలాషమ్’ సినిమా విషయానికొస్తే.. అభిలాష్ కుమార్, షెరిన్ మూసా లవ్, లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్గా సాగే కథ. డైరెక్టర్ శాంషు సైబా నాకు కథ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. షెరిన్ మూసా ఈ కథలో బలమైన పాత్ర.
సాహసయాత్రలు ఇష్టం
నటినయ్యాక నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. నా లైఫ్ స్టయిల్లో ట్రావెలింగ్ ఒక భాగమైపోయింది. సినిమాల్లోకి వచ్చాక లెక్కలేనన్ని ట్రిప్‌లకు వెళ్లా. బిజీ షెడ్యూల్లో కూడా కాస్త టైం దొరికితే చాలు ట్రిప్‌కి ప్లాన్ చేసుకుంటా. ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్‌తో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటా. లేహ్– లఢక్ ట్రిప్ మర్చిపోలేని అనుభూతినిచ్చింది. ఆ ట్రిప్‌లో నేను బైక్ డ్రైవింగ్ కూడా చేశా. ఒకసారి నేను, నా కాలేజీ ఫ్రెండ్స్ ఉన్నట్టుండి కశ్మీర్ టూర్‌కి ప్లాన్ చేసుకున్నాం.
మేం ఇంతకుముందు ఎప్పుడూ అక్కడికి వెళ్లలేదు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే లైఫ్‌లో ఒక్కసారైనా ఆ ప్లేస్‌ని విజిట్ చేయాల్సిందే అనిపిస్తుంది. తర్వాత భూటాన్, లక్షద్వీప్, గోవా, వర్కల, పాండిచ్చేరి వంటి ప్లేస్‌లు విజిట్ చేశా. అయితే ట్రావెలింగ్‌లో నాకు ఇష్టమైన విషయం ఏంటంటే.. అడ్వెంచర్స్ చేయడం. లేహ్ – లఢక్ ట్రిప్‌లో బైక్ డ్రైవింగ్, ట్రెక్కింగ్ చేశా. నీళ్లంటే భయం ఉన్నా సరే ఒక ట్రిప్‌లో స్కూబా డైవింగ్ చేశా. మరోచోట రెండు సార్లు స్కై డైవింగ్, రివర్ రాఫ్టింగ్ ట్రై చేశా. ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌లకు వెళ్లడం చాలా సరదాగా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ ట్రావెలింగ్ అంటే ఇష్టమే.. అందుకే ఏడాదికి ఒకసారి ట్రిప్‌కు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటాం.
మిస్ కేరళ..
మాది మలయాళీ ఫ్యామిలీ. అయితే మా నాన్న చాలా ఏండ్ల కిందటే కేరళ నుంచి కర్నాటక వచ్చేసి బెంగళూరులో స్థిరపడ్డారు. అందువల్ల నేను పుట్టింది, పెరిగిందంతా బెంగళూరే. నాకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ, ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లు ఎవరూ లేరు. కానీ, మోడలింగ్ వంటి అవకాశాలు వస్తే సరదాగా ప్రయత్నించేదాన్ని. అలాంటి ప్రయత్నాల్లో 2012లో ఒకసారి మిస్ కేరళ పోటీల్లో పాల్గొన్నా. అందులో ఫైనలిస్ట్ కూడా అయ్యాను. అయితే ‘నేను అసలు అంతవరకు వెళ్తాను లేదా వెళ్లాలి. తప్పకుండా ఇందులో పార్టిసిపేట్ చేయాలి’ అని సీరియస్‌గా తీసుకోలేదు. అదంతా ఎలాంటి ప్లానింగ్ లేకుండానే జరిగిపోయింది.
ఫైనలిస్ట్ అవ్వడంతో మనసులో చిన్న ఆశ చిగురించింది. ఆల్రెడీ బ్యూటీ, మోడలింగ్, సినిమా వంటి విషయాల్లో ఎప్పుడూ ఆసక్తిగా ఉండే నాకు ఇది ఒక మంచి అవకాశం కాబట్టి తద్వారా ముందుకు వెళ్లొచ్చు అనిపించింది. దాంతో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశా. కొన్నేండ్లపాటు ఆడిషన్స్ ఇస్తూ స్టూడియోల చుట్టూ తిరిగా. 2019లో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆఫర్ ఫైనల్ అయ్యేవరకు నమ్మకం కుదరలేదు. అందుకే జాబ్ మానేయకుండా కంటిన్యూ చేశా. ఎప్పుడైతే ఆఫర్ ఫైనల్ అయిందని తెలిసిందో.. ఆ వెంటనే మానేశా.