మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రియలిస్టిక్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఊహించని ట్విస్టులు, చివరి వరకు ఉత్కంఠ కలిగించే కథలతో ఈ సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి మరో ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'ఉయిర్' . . రోషన్ మ్యాథ్యూ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 26న థియేటర్లలో విడుదలైంది. థ్రిల్లర్ ప్రియుల నుండి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అయింది.
స్ట్రీమింగ్ ఎక్కడంటే.
ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో రూపొందింది. పోలీస్ అధికారి అన్షాద్ తన సర్వీస్‌లో ఎదుర్కొన్న అనుభవాలను ఆధారంగా చేసుకుని షాజీ మారడ్, నిఖిల్ కె. మేనన్ కథను తెరకెక్కించారు.. దీంతో సినిమాలో ప్రతి ఇన్వెస్టిగేషన్ సీన్ ఎంతో సహజంగా, వాస్తవానికి దగ్గరగా అనిపిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 4 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
కథ విషయాని కొస్తే..
అజీబ్ రహ్మాన్ (రోషన్ మ్యాథ్యూ) ప్రొబెషనరీ ఎస్‌ఐగా బాధ్యతలు చేపడతాడు. కొద్దిరోజుల్లోనే పాడుబడిన బావిలో ఓ మహిళ మృతదేహం బయటపడుతుంది. మొదట ఇది సాధారణ కేసులా కనిపించినా.. విచారణ ముందుకు సాగేకొద్దీ సంచలన నిజాలు బయటపడతాయి. ఆ మహిళ మరణం వెనుక భారీ కుట్ర, పలురాష్ట్రాలకు విస్తరించిన క్రైమ్ నెట్‌వర్క్ ఉన్నట్లు అజీబ్ గుర్తిస్తాడు. కేసు దర్యాప్తు సాగుతున్న కొద్దీ అతడి వ్యక్తిగత జీవితంతోనూ ఈ మిస్టరీకి అనుబంధం ఉన్నట్లు తెలుస్తుంది. చివరకు హంతకుడు ఎవరు? నిజం వెలుగులోకి వచ్చిందా? అజీబ్ న్యాయం చేయగలిగాడా? అన్నదే అసలు కథ.
రోషన్ మ్యాథ్యూ తన కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోగా, బైజు సంతోష్, సయామి ఖేర్, శ్రుతి మీనన్, వినోద్ సాగర్, అతుల్య చంద్ర తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. క్రైమ్, ఎమోషన్, సోషల్ మెసేజ్‌లను సమతూకంగా మేళవించిన 'ఉయిర్' థ్రిల్లర్ ప్రియులకు తప్పక చూడాల్సిన సినిమాగా సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
