బ్యూటీ టిప్స్ అనగానే గుర్తొచ్చేది ఆడవాళ్లే. మరి మగవాళ్ల మాటేంటి.. అబ్బాయిలకీ బోలెడు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటికి పరిష్కారాలే ఇవి.. స్మార్ట్ గా కనిపించాలంటే అబ్బాయిలు ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.
అబ్బాయిల అందానికి ..మగవాళ్ల చర్మం ఆడవాళ్ల చర్మం కంటే ఎక్కువ జిడ్డుగా ఉంటుంది. అయితే కొందరి చర్మం మాత్రం పొడిబారుతుంది. అందుకే ఏ సీజన్లో అయినా మగవాళ్లు తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చర్మతత్వాన్ని బట్టి సరైన మాయిశ్చరైజర్ ఎంచుకుని.." రోజుకి రెండుమూడు సార్లు రాయాలి. అలాగే బయటికెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి.
- అబ్బాయిలంతా ముఖానికి సబ్బులే వాడుతుంటారు. కానీ, సోప్ కన్నా ఫేస్ వాష్ వాడటం మంచిది. సెన్సిటివ్ స్కిన్ వాళ్లు అసలు సబ్బు జోలికే వెళ్లకూడదు. మైక్రో బీడ్స్ కలిగిన ఫేస్ వాష్ లు ట్యాన్ ని పోగొడతాయి. కాబట్టి అలాంటి వాటినే వాడాలి. మగవాళ్ల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఫేస్ వాష్లను ఎంచుకోవచ్చు.
- కొన్ని హెయిర్ జెల్స్ లో ఆల్కహాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు నేచురల్ ఆయిల్స్‌ని కోల్పోయేలా చేస్తుంది. జుట్టు డ్రైగా, డ్యామేజ్ అవడానికి కారణమవుతుంది. అందువల్ల అలాంటి జెల్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. వాటికంటే కొబ్బరినూనె వాడటం మేలు.
- గడ్డం పెంచుకునే అబ్బాయిలు వారానికి రెండుసార్లు షాంపూ, కండిషనర్ ను రాయాలి. ఇవి గడ్డాన్ని స్మూత్ గా ఉంచుతాయి. దురద లేకుండా చేస్తాయి.
- ఫేస్ ప్యాక్స్ చర్మంలో పేరుకున్న డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తాయి. చర్మాన్ని హెల్దీగా చేస్తాయి. అందువల్ల వారానికోసారి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇందుకోసం రెండు చార్ కోల్ క్యాప్సుల్స్ తీసుకొని, వాటిని రోజ్ వాటర్ లో కలిపి పేస్ట్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. పావుగంట తర్వాత శుభ్రం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం మృదువుగా, హెల్దీగా ఉంటుంది.
