నిర్వాసితుల ప్లాట్లకూ ఎల్ఆర్ఎస్ కట్టాలట... అయోమయంలో మల్లన్నసాగర్ నిర్వాసితులు

నిర్వాసితుల ప్లాట్లకూ ఎల్ఆర్ఎస్ కట్టాలట... అయోమయంలో మల్లన్నసాగర్  నిర్వాసితులు
  •  ఆర్​అండ్​ఆర్​ కాలనీలో ఇండ్లకు నో పర్మిషన్​
  • గతంలో డీటీసీపీ అప్రూవల్ తీసుకోని అధికారులు
  • గత పాలకుల నిర్లక్ష్యంతో తప్పని తిప్పలు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: గజ్వేల్ ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్ కాలనీలో నివాసముంటున్న మల్లన్నసాగర్ నిర్వాసితులకు వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. గత పాలకులు చేసిన నిర్లక్ష్యానికి నిర్వాసితులు బలి కావాల్సి వస్తోంది. ఇంటి అనుమతులకు బాధితులు నానా తిప్పలు పడుతున్నారు. ఏడేండ్ల క్రితం నిర్వాసితులను హడావుడిగా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌‌‌‌పల్లి, సంగాపూర్‌‌‌‌లో నిర్మించిన ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్ కాలనీలకు తరలించారు.

 అయితే ఈ కాలనీకి డీటీసీపీ, కలెక్టర్ నుంచి అప్రూవ్డ్ లే అవుట్ లేకపోవడంతో ప్రస్తుతం కొత్తగా ఇండ్లు నిర్మించుకోవాలనుకునే నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే ముందుగా ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్ చేసుకుని, ఆ తర్వాత బిల్డింగ్ పర్మిషన్‌‌‌‌కు దరఖాస్తు చేసి ఫీజులు చెల్లించాలని సూచిస్తున్నారు. దీంతో తమకు ఉన్న స్థలంలో ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్, బిల్డింగ్ పర్మిషన్ల కోసం దాదాపు రూ.2 లక్షల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని నిర్వాసితులు వాపోతున్నారు. 

ఫీజుల భారం భరించలేక అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వం కోల్పోయి ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్ కాలనీకి వస్తే, సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఫీజుల పేరుతో లక్షలు వసూలు చేస్తున్నారని నిర్వాసితులు అంటున్నారు. కాలనీకి తరలించే సమయంలో పదేండ్ల వరకు ఎలాంటి ట్యాక్స్‌‌‌‌లు, నిర్మాణాలకు ప్రత్యేక అనుమతులు, చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పినా.. అందుకు సంబంధించిన ఉత్తర్వులను తమకు ఇవ్వలేదని చెబుతున్నారు. 

నిర్వాసితులను తరలించిన సమయంలో పనిచేసిన అధికారులు ఇప్పుడు లేకపోవడంతో తాము ఎవరిని సంప్రదించినా నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారని వాపోతున్నారు. అనుమతులు ఉన్నా వాటికి సంబంధించిన ఫైలు ఎవరి వద్ద ఉందో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు.

అధికారుల తప్పిదంతో..

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల నిర్వాసితుల కోసం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 600 ఎకరాల్లో ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్ కాలనీ నిర్మించారు. ఇందులో 3 వేల మందికి ఇండ్లు నిర్మించి అప్పగించగా, మరో 3 వేల మందికి ఓపెన్ ప్లాట్లు అందజేశారు. 

నిర్వాసితుల కోసం డీటీసీపీ నిబంధనలకు అనుగుణంగా కాలనీని లే అవుట్ చేసిన అధికారులు, భవిష్యత్‌‌‌‌లో ఇబ్బందులు రాకుండా అవసరమైన అనుమతులు తీసుకునే విషయాన్ని పట్టించుకోలేదని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. కాలనీ నిర్మాణ సమయంలో అన్ని అనుమతులు తీసుకున్నారో లేదో కూడా స్పష్టత లేదని, తీసుకుని ఉంటే వాటికి సంబంధించిన పత్రాలు ఎవరి వద్ద ఉన్నాయో తెలియడం లేదని చెబుతున్నారు. 

ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్, బిల్డింగ్ పర్మిషన్ల కోసం లక్షల రూపాయలు చెల్లించడం ఇష్టం లేని కొందరు నిర్వాసితులు అనుమతులు లేకుండానే నిర్మాణాలు ప్రారంభిస్తుండగా, మున్సిపల్ అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. దీంతో నిర్మాణాలు ప్రారంభించిన వారు, నిర్మించుకోవాలనుకునే వారు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.

పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు..

ఇళ్ల నిర్మాణ అనుమతుల సమస్యతోపాటు ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్ కాలనీలో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు కూడా భారీగా పేరుకుపోయాయి. దాదాపు 500 ఇళ్లకు మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు కేటాయించారు. వీటికి ఏటా ట్యాక్స్ విధిస్తున్నప్పటికీ చెల్లింపులు జరగకపోవడంతో అసలు, పెనాల్టీ కలిపి దాదాపు రూ.కోటి వరకు బకాయిలు చేరినట్లు తెలుస్తోంది. 

మరోవైపు కాలనీలో స్ట్రీట్ లైట్ల విద్యుత్ బిల్లుల బకాయిలు దాదాపు రూ.3 కోట్లకు చేరినట్లు సమాచారం. కాలనీ నుంచి ట్యాక్స్‌‌‌‌లు వసూలు కాకపోవడంతో మున్సిపల్ అధికారులు విద్యుత్ శాఖకు స్ట్రీట్ లైట్ల బిల్లులు చెల్లించలేకపోతున్నట్లు తెలుస్తోంది.

రూల్స్​ ప్రకారమే నడుచుకుంటున్నాం

గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌‌‌‌అండ్‌‌‌‌ఆర్ కాలనీలో ఇళ్ల నిర్మాణ అనుమతులతో పాటు ఇతర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇళ్ల నిర్మాణ అనుమతుల విషయంపై ఇప్పటికే డీటీసీపీకి లేఖ రాసినా స్పందన లేదు. కాలనీకి డీటీసీపీ అప్రూవ్డ్ లే అవుట్ లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్ చేసుకుని, బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు చెల్లించి నిర్మాణాలు చేపట్టాలని సూచిస్తున్నాం. మున్సిపల్ నిబంధనల ప్రకారమే బిల్డింగ్ పర్మిషన్ ఫీజులు వసూలు చేస్తూ, అనుమతులు లేని నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నాం.

– కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్, గజ్వేల్-