గర్భధారణ అంటే ప్రతి కుటుంబానికీ ఆనందం, ఎన్నో ఆశలు. కానీ అల్ట్రాసౌండ్‌లో బిడ్డ ఆశించినంతగా ఎదగడం లేదని తేలినా, శరీర నిర్మాణంలో ఏదైనా తేడా కనిపించినా, జన్యుపరమైన సమస్య ఉందని పరీక్షల్లో తెలిసినా ఆ ఆనందం ఒక్కసారిగా ఆందోళనగా మారుతుంది. కవలల గర్భంలో సమస్యలు ఎదురైతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారొచ్చు.
హైదరాబాద్‌లో ఫీటల్ మెడిసిన్ ప్రత్యేక విభాగంగా అభివృద్ధి చెందడంతో గర్భధారణను చూసే విధానంలోనూ మార్పు వచ్చింది. సమస్య తీవ్రంగా మారిన తర్వాత చికిత్స చేయడం కంటే, అది వచ్చే అవకాశం ఉందా అని ముందుగానే తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు ముఖ్యమవుతోంది. తొలి మూడు నెలల్లో చేసే పరీక్షలు కేవలం బిడ్డ గుండె కొట్టుకుంటుందా లేదా అనే విషయానికే పరిమితం కావు.11 నుంచి13 వారాల మధ్య చేసే సమగ్ర పరీక్షలతో బిడ్డ ప్రారంభ ఎదుగుదలను పరిశీలించొచ్చు. కొన్ని జన్యుపరమైన, శరీర నిర్మాణ సమస్యలు వచ్చే అవకాశాన్ని కూడా అంచనా వేయొచ్చు.
నూచల్ ట్రాన్స్‌లూసెన్సీ పరీక్షను తల్లి రక్త పరీక్షలతో కలిపి చేయడం ద్వారా డౌన్ సిండ్రోమ్ వంటి క్రోమోజోమ్ సమస్యలు ఉండే అవకాశాన్ని తెలుసుకోవచ్చు. తల్లి రక్తంలో ఉండే బిడ్డకు సంబంధించిన డీఎన్‌ఏను పరిశీలించే నాన్-ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ (ఎన్‌ఐపీటీ) కూడా సాధారణ క్రోమోజోమ్ సమస్యలను గుర్తించేందుకు ఉపయోగపడే మరో సున్నితమైన స్క్రీనింగ్ పరీక్ష.
స్క్రీనింగ్ పరీక్షల్లో ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలితే, కోరియానిక్ విల్లస్ శాంప్లింగ్ (సీవీఎస్), అమ్నియోసెంటిసిస్ వంటి నిర్ధారణ పరీక్షలు చేయొచ్చు. వీటి ద్వారా క్రోమోజోమ్ లేదా జన్యుపరమైన సమస్యలు ఉన్నాయా లేదా అన్నది మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ దశలో క్లినికల్ జెనెటిక్స్, జన్యు సలహా కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తొలి దశలోనే ప్రీ-ఎక్లాంప్సియా, ముందస్తు ప్రసవం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్న మహిళలను కూడా గుర్తించొచ్చు.
పుట్టకముందే శిశువును పరీక్షించి..
ఫీటల్ మెడిసిన్‌లో వచ్చిన ముఖ్యమైన మార్పుల్లో ఒకటి.. గర్భస్థ శిశువును పుట్టకముందే ప్రత్యేక వైద్య శ్రద్ధ అవసరమైన రోగిగా అంచనా వేసి, కొన్ని పరిస్థితుల్లో చికిత్స చేయగలగడం. మెదడు, గుండె, మూత్రపిండాలు, ఎముకలు, ఇతర అవయవాల్లో ఉండే నిర్మాణ సమస్యలను పుట్టకముందే గుర్తించొచ్చు. ఫీటల్ ఎకోకార్డియోగ్రఫీ ద్వారా గుండెకు సంబంధించిన ముఖ్యమైన లోపాలను కూడా పుట్టకముందే గుర్తించే అవకాశం ఉంది.
కొందరికి పుట్టిన వెంటనే నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ అవసరం కావచ్చు. మరికొందరికి పిల్లల శస్త్రచికిత్స నిపుణుల సేవలు అవసరమవుతాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో చికిత్సను బిడ్డ పుట్టే వరకు వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు.ఉదాహరణకు బిడ్డకు తీవ్రమైన రక్తహీనత ఏర్పడితే, గర్భంలోనే రక్త మార్పిడి చేయొచ్చు. కొన్ని ప్రత్యేక గుండె స్పందన సమస్యలు, మరికొన్ని పరిస్థితుల్లోనూ బిడ్డ గర్భంలో ఉండగానే చికిత్స చేసే అవకాశం ఉంది.
హైరిస్క్ నుంచి బయటపడొచ్చు!
హైదరాబాద్‌లో హైరిస్క్ గర్భధారణను ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ నిపుణులతోపాటు ప్రసూతి వైద్యులు, ఫీటల్ కార్డియాలజిస్టులు, జన్యు సలహాదారులు, నియోనేటాలజిస్టులు, పిల్లల శస్త్రచికిత్స నిపుణులు, అవసరాన్ని బట్టి ఇతర వైద్య నిపుణులు కూడా కలిసి పనిచేస్తున్నారు.
బిడ్డను చూడటం మాత్రమే కాదు
ఫీటల్ మెడిసిన్‌లో అల్ట్రాసౌండ్ అంటే కేవలం బిడ్డ చిత్రాన్ని చూడటం కాదు. గర్భధారణ ప్రారంభ దశలో బిడ్డల సంఖ్య, శిశువు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం నుంచి 11-,13 వారాల్లో ప్రారంభ శరీర నిర్మాణం, క్రోమోజోమ్ సమస్యలకు సంబంధించిన సూచనలను పరిశీలించడం వరకు ఒక్కో స్కాన్ ఒక్కో వైద్య అవసరాన్ని తీర్చుతుంది.సాధారణంగా 19 నుంచి 22 వారాల మధ్య చేసే డీటైల్డ్ అనామలీ స్కాన్‌లో బిడ్డ అభివృద్ధి చెందుతున్న అవయవాలను క్రమపద్ధతిలో పరిశీలిస్తారు. అదే సమయంలో ప్లాసెంటా, గర్భంలోని నీటిని కూడా అంచనా వేస్తారు.
గర్భధారణ తరువాతి దశల్లో చేసే స్కాన్లలో బిడ్డ ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితిని గమనిస్తారు.కొన్నిసార్లు బిడ్డ ఆశించిన దానికంటే చిన్నగా ఉన్నట్లు కనిపిస్తుంది. అప్పుడు డాప్లర్ పరీక్ష ద్వారా రక్తప్రసరణను పరిశీలిస్తారు. బిడ్డను సాధ్యమైనంతకాలం గర్భంలో సురక్షితంగా ఉంచుతూ, గర్భధారణ కొనసాగడం వల్ల కలిగే ప్రమాదం ఎక్కువయ్యేలోపు ప్రసవం చేయడానికి సరైన సమతుల్యతను కనుగొనడమే లక్ష్యం.
పరీక్షలతోపాటు..
తల్లిదండ్రులతో సరిగ్గా మాట్లాడటం కూడా అంతే ముఖ్యం. గర్భంలో బిడ్డకు ఏదైనా సమస్య ఉందని తెలిసినప్పుడు తల్లిదండ్రులు ఆందోళనకు గురికావడం సహజం. అందుకే ఏం గుర్తించారు? ఇంకా ఏం తెలియాల్సి ఉంది? ఏ పరీక్షలు అవసరం, ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? బిడ్డ పుట్టిన తర్వాత ఏం అవసరం కావచ్చు వంటి విషయాలను స్పష్టంగా వివరిస్తారు. అనవసరమైన భయం కలిగించకుండా, అదే సమయంలో తప్పుడు భరోసా ఇవ్వకుండా మాట్లాడటం చాలా అవసరం. సరైన సమాచారాన్ని అందించి, పరిస్థితిని అర్థం చేసుకునేలా చేసి, తల్లిదండ్రులు సరైన నిర్ణయం తీసుకునేలా సహకరిస్తారు.
కవలల గర్భధారణలో..
ఇద్దరు బిడ్డలు ఒకే ప్లాసెంటాను పంచుకునే గర్భాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్విన్- టు -ట్విన్ ట్రాన్స్‌ఫ్యూజన్ సిండ్రోమ్, ట్విన్ అనీమియా-పాలీసైథీమియా సీక్వెన్స్, ట్రాప్ సీక్వెన్స్ వంటి సమస్యలు తలెత్తొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇవి వేగంగా తీవ్రమవ్వొచ్చు. గతంలో ఇలాంటి సమస్యలకు చికిత్స అవకాశాలు పరిమితంగా ఉండేవి. ఇప్పుడు తొలి దశలోనే సమస్యను గుర్తించడం వల్ల పరిస్థితిని మెరుగుపడింది. క్రమం తప్పకుండా చేసే అల్ట్రాసౌండ్ ద్వారా ఇద్దరు బిడ్డల ఎదుగుదల, గర్భంలోని నీటి పరిమాణం, రక్తప్రసరణలో వచ్చే మార్పులను గమనించొచ్చు.
- డా. స్మితా పవార్
ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ హెడ్
